'రాజ్యసభ ఎంపీలు అవసరానికి మించి బుక్ చేస్తున్నారు'

by Shamantha N |
రాజ్యసభ ఎంపీలు అవసరానికి మించి బుక్ చేస్తున్నారు
X

న్యూఢిల్లీ: ప్రజల యోగక్షేమాల కోసం సేవ చేయాలని కల్పించే సదుపాయాలు, వసతులను కొందరు నేతలు విచ్చలవిడిగా సొంత అవసరాల కోసం వినియోగిస్తుంటారు. చివరికి అభాసుపాలవుతారు. భారత రైల్వే చేసిన ఆరోపణలు ఇలాంటి ఉదంతాలనే గుర్తుకుతెస్తున్నాయి. రాజ్యసభ ఎంపీలు అవసరానికి మించి టికెట్లను బుక్ చేస్తున్నారని ఆరోపించింది. ఒకే ప్రయాణానికి ఒక్కోసారి వేర్వేరు స్టేషన్‌లలో వేర్వేరు ట్రైన్‌ల టికెట్లు బుక్ అవుతున్నాయనీ, సదరు ఎంపీ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత కూడా మిగతా టికెట్లను రద్దు చేయడం లేదని తెలిపింది. దీంతో రాజ్యసభ సెక్రెటేరియట్ రైల్వే చెల్లించాల్సిన బకాయిలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఫలితంగా కరోనాతో పోరాడుతున్న ఈ సందర్భంలోనూ ప్రభుత్వం రూ. 8 కోట్లు(2019కు సంబంధించిన మొత్తం) రైల్వేకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో రాజ్యసభ చైర్మెన్ ఎంపీలను హెచ్చరించారు. తమ అవసరాలకు మించి రైల్వే టికెట్లను బుక్ చేసినట్టు నిర్ధారణ అయితే ఆ మొత్తాలను వారి జీతాల నుంచే కోత విధించి చెల్లిస్తామని తెలిపారు. ఇలా ఎక్కువ టికెట్లు కొంత మంది బుక్ చేసేవారని, వారే మళ్లీ మళ్లీ రిపీట్ చేశారని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ టికెట్లతో సదరు ఎంపీ వర్గీయులు ఉచితంగా ప్రయాణించేవారని వివరించాయి. కొన్ని సార్లు బుక్ చేసి రద్దు చేయకపోవడం వల్ల ఇతరులకు ఆ సీటు అందుబాటులో లేకుండాపోయి ఆ ట్రిప్‌లో ఖాళీగానే మిగిలిపోయేవని తెలిపాయి.

Advertisement

Next Story