యానివర్సరీ గిఫ్ట్‌గా..’మూన్’ ల్యాండ్

by Sujitha Rachapalli |   ( Updated:2020-12-27 07:11:58.0  )
యానివర్సరీ గిఫ్ట్‌గా..’మూన్’ ల్యాండ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘చుక్కల తెమ్మన్న తీసుకురానా..జాబిల్లిని కూడా నీ ముంగిట్లో నిలెబెట్టనా’ అంటూ కుర్రకారు ప్రేయసిని ఫిదా చేయడానికి బోలెడు మాటలు చెబుతారు. కానీ, పెళ్లైన తర్వాత ఏదైనా అడిగితే.. కస్సుబుస్సుమనడం సర్వసాధారణమే. అయితే ఓ భర్త మాత్రం తమ పెళ్లిరోజును పురస్కరించుకుని తన భార్య ఎప్పటికీ మర్చిపోలేని బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. చుక్కలను, జాబిల్లిని తీసుకు రాకపోయినా..వాటి చెంతనే స్థలం కొని తన బెటరాఫ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంతకీ ఆ లక్కీ పర్సన్ ఎవరంటే..

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనీజా, సప్నాఅనిజ 2012, డిసెంబర్ 24న వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా, ఈ ఏడాది తమ మ్యారేజ్ యానివర్సిరీ సందర్భంగా తన భార్యకు ఏదైనా స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని భావించిన ధర్మేంద, అందుకోసం ఏకంగా చంద్రమండలంలో మూడు ఎకరాలను కొనేసి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ‘కార్లు, నగలు, బంగ్లాలు అందరూ కొనిస్తారు, కానీ నేనిచ్చే బహుమతి సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలనుకున్నాను. నా కానుక నా భార్యకు చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే చంద్రుడి మీద ప్లాట్‌ కొనిచ్చాను. బహుశా చంద్రమండలం మీద స్థలాన్ని కొన్న మొదటి రాజస్థాన్‌ వ్యక్తిని నేనే అనుకుంటాను. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ స్థలాన్ని కొన్నాను. దీనికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టింది’ అని ధర్మేంద్ర చెప్పుకొచ్చాడు. ‘నా భర్త ఇంత గొప్ప బహుమతి ఇస్తారని ఊహించలేదు. చంద్రమండలం స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ చూస్తుంటే నాకిప్పుడు చంద్రుడి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది. నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది ’ అని సప్నా తెలిపింది.

ఇటీవల కాలంలో చంద్రుని మీద స్థలం కొనడం చాలా సాధారణమైంది. 2020లోనే బోధ్ గయాకు చెందిన నీరజ్ కుమార్ అనే బిజినెస్‌మ్యాన్ తన పుట్టినరోజు సందర్భంగా చంద్రునిపై ఓ ఎకరం భూమిని కొన్నాడు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చంద్రమండలంపై భూమిని కొనగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రాజీవ్ బగాడి 2003లోనే 140 అమెరికా డాలర్లు చెల్లించి ఆన్‌లైన్‌లో చంద్రునిపై 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. మరికొంతమంది సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా కొన్నట్లు సమాచారం. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ‘లూనార్ రిజిస్ట్రీ, లూనార్ ల్యాండ్స్’ అనే రెండు కంపెనీలు చంద్రమండలంపై స్థల విక్రయాలు చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలనే కాదు..చంద్ర మండలంపై స్థలాలు, అనేక ఖగోళ పదార్థాలను అమ్ముతామనే వెబ్‌సైట్లు ఎన్నో ఉన్నాయి. అమ్మకాలపై ఇవన్నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందిస్తున్నాయి. మరి వాటికి చట్టబద్ధత ఉంటుందా? అంటే చంద్రమండలంపై ఏ దేశానికి హక్కులు ఉండవని ‘ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ’ పేర్కొంటోంది.

Advertisement

Next Story