వికారాబాద్‌లో గాలివాన బీభత్సం.. కరెంట్ కట్

by Shyam |   ( Updated:2021-05-03 09:59:32.0  )
వికారాబాద్‌లో గాలివాన బీభత్సం.. కరెంట్ కట్
X

దిశ, వికారాబాద్ : సోమవారం వికారాబాద్ పట్టణ పరిధిలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు భగభగా మండిపోయాడు. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకొని, ఈదురు గాలులు వీచాయి. దాంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.

ముఖ్యంగా హైదరాబాద్ రెండవ ప్రధాన రహదారిగా పిలవబడే ధన్నారం- హైదరాబాద్ రోడ్‌లో సోలార్ కరెంటు స్తంభం ఒక్కసారిగా రోడ్డుపై పడింది. ఆ సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పాటు ఆ దారి గుండా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ట్రాన్స్కో సిబ్బంది వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు గ్రామాలకు సైతం కరెంటు సరఫరా నిలిపివేశారు. పట్టణ పరిధిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటి కాలువలు సైతం పొంగిపొరలడంతో రోడ్లన్నీ వరద నీటితో జలమయమయ్యాయి.

దాదాపు గంట పాటు కురిసిన వర్షం ఒక్కసారిగా పట్టణ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. దీంతో పట్టణ ప్రజలు కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు రాత్రి జాగారమే అంటూ నిట్టురుస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి తెగిపడిన విద్యుత్ వైర్లు, కరెంట్ స్తంభాలను త్వరితగతిన బాగు చేసి కరెంటు సరఫరా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed