రాజకీయం కాదు…వృద్ధిపై దృష్టి పెట్టాలి!

by Shyam |   ( Updated:2020-03-01 02:14:41.0  )
రాజకీయం కాదు…వృద్ధిపై దృష్టి పెట్టాలి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం కంటే తమ రాజకీయ, సామాజిక ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.

కీలకమైన అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా ఇండియాలో మందగించిన ఆర్థిక వృద్ధిని తిప్పికొట్టగలమని ఆయన అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశ వృద్ధిని అడ్డుకుంటున్నదేది అన్న ప్రశ్నకు సమాధానంగా, ‘ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలే’ అని రాజన్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన భారీ మెజారిటీ తర్వాత, ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టడం కంటే తమ రాజకీయ, సామాజిక ఎజెండాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఈ పరిస్థితులు ఉన్నాయని రాజన్ తెలిపారు.

‘ఈ పరిణామాలతో, ఇదివరకే మందగమనం దిశగా పయనిస్తున్న ఆర్థిక వృద్ధిని మరింత క్షీణించేలా చేసింది. మొదటిసారిగా ప్రభుత్వం నోట్ల రద్దు ప్రక్రియను తీసుకొచ్చింది. తర్వాత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి సంస్కరణ చర్యల కారణంగా ఆర్థిక వృద్ధి గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోంది’ అని రాజన్ అన్నారు.

శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి డిసెంబర్ త్రైమాసికంలో ఏడేళ్ల కనిష్ఠానికి దిగజారి 4.7 శాతానికి పడిపోయింది. ఈ వృద్ధి 2012-13 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి తరువాత ఇదే తక్కువ నమోదు.

అధికారిక గణాంకాలు విడుదలకు ముందే ప్రసారమైన ఇంటర్వ్యూలో, ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించే విషయంలో ఇండియా తగిన శ్రద్ధ చూపించలేదని, ఈ నిర్లక్ష్యం మందగించే వృద్ధికి దారితీస్తుందని రాజన్ అన్నారు. ఇకనైన శ్రద్ధ వహించి, తగిన చర్యలు తీసుకుంటే ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టవచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్, దాని ప్రభావం గురించి అడిగినప్పుడు..అంతర్జాతీయ సరఫరాలో కొన్ని వారసత్వ సమస్యలున్నాయని, వాటి విషయంలో పునరాలోచించాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story