జులైలో ఇండియాకు రాఫెల్ విమానాలు

by Shamantha N |
జులైలో ఇండియాకు రాఫెల్ విమానాలు
X

న్యూఢిల్లీ: తొలిబ్యాచ్ ఫుల్లీ లోడెడ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెలాఖరుకల్లా భారత్‌కు రానున్నాయి. లాంగ్ రేంజ్ మిటియర్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌ను అనుసంధానించే ఈ యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాల నగరానికి చేరనున్నాయి. ఈ మిస్సైల్‌ కారణంగా రాఫెల్ యుద్ధ విమానాలు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ధ్వంసం చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితులు, ఫ్రాన్స్‌లో భారత పైలట్ల శిక్షణల ప్రకారం వచ్చే నెలాఖరులో ఆరు రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వచ్చే అవకాశమున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విమానాలు ఫుల్ ప్యాకేజీతో వస్తున్నాయని, వచ్చిన రోజుల వ్యవధిలోనే సేవలందించవచ్చునని వివరించాయి.

చైనాతో సరిహద్దు ఘర్షణలు చోటుచేసుకున్న తరుణంలో ఈ వార్త రావడం గమనార్హం. ఇప్పుడున్న అవసరాల మేరకు ఈ ఎయిర్‌క్రాఫ్టుల సంఖ్య ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని, ఫ్రాన్స్‌లో శిక్షణ పొందుతున్న పైలట్‌ల సంఖ్యపైనా ఆధారపడి ఈ నిర్ణయం ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. పలు అంశాలను పరిగణలోకి తీసుకుని వచ్చే నెల మధ్యలో రాఫెల్ విమానాలు భారత్‌కు తీసుకువచ్చే తేదీని ఖరారు చేయనున్నట్టు పేర్కొన్నాయి. 17 గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ కమాండింగ్ అధికారి ఫ్రెంచ్ పైలట్‌తో కలిసి తొలి రాఫెల్‌ను భారత్‌కు తీసుకురాబోతున్నట్టు వెల్లడించాయి.

ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఈ విమానాలు మార్గంమధ్యలో మిడిల్ ఈస్ట్‌ దేశంలో ఆగనున్నాయి. ఈ దేశం చేరేలోపు రాఫెల్ విమానాలకు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలోనే ఇంధనాన్ని అందించనుంది. మళ్లీ బయల్దేరాక ఇండియన్ ఐఎల్-78 ట్యాంకర్ ద్వారా ఇంధనాన్ని సమకూర్చనున్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016 సెప్టెంబర్‌ ఫ్రాన్స్‌తో భారత్ రూ. 60వేల కోట్లతో డీల్ కుదుర్చుకుంది.

Advertisement

Next Story

Most Viewed