ఘట్‌కేసర్ కేసు… అసలు నిజాలు వెల్లడించిన సీపీ

by Sumithra |   ( Updated:2023-04-01 18:51:52.0  )
ghatkesar B pharm student case
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్‌ కేసుకు సంబంధించిన అసలు నిజాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ తేల్చి చెప్పారు. విద్యార్థి కిడ్నాప్, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా నిర్ధారించినట్లు వెల్లడించారు. యువతి చెప్పిన విధంగా ఈ ఘటన జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఘట్‌కేసర్ కేసు యువతి అల్లిన కట్టుకథ అని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదిన సాయంత్రం 6.29 గంటలకు 100 డయల్‌కు కాల్ వచ్చింది. మా అమ్మాయి 5.30 గంటలకు కాలేజీ బస్సు నుంచి దిగి ఆటోలో ఇంటికొచ్చేది. కానీ, ఇప్పటివరకు రాలేదు. రాంపల్లి చౌరస్తా వద్ద ఇంటికొచ్చేందుకు ఆటో ఎక్కగా.. స్టేజ్ వచ్చినా ఆటోవాళ్లు ఆపకుండా తీసుకెళ్లారంటూ యువతి తల్లి నుంచి కాల్ వచ్చిందన్నారు. సమాచారం అందుకున్న కీసర, మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అమ్మాయి కోసం అంతటా పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో పోలీసులు పలుమార్లు అమ్మాయి ఫోన్‌కి కాల్ చేసిన స్పందన రాలేదు. దీంతో అమ్మాయి లైవ్ లోకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో చిన్న గాయాలు, చిరిగిన బట్టలతో అమ్మాయి కనిపించింది. ఇదే సమయంలో పోలీసులు అమ్మాయి వద్దకు వెళ్లి ఆరా తీసిన మాట్లాడే పరిస్థితిలో లేదు. వెంటనే పోలీసులు పక్కనే ఉన్న మేడిపల్లి క్యూర్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు అన్నోజీగూడ ప్రాంతంలో దృష్టి సారించారు. అమ్మాయి సిమ్ కార్డు ఎయిర్ టెల్ టవర్ ఆధారంగా ఎక్కడెక్కడ ఉందన్న కోణంలో విచారిస్తే అన్నోజీగూడలో ఉన్నట్టు తేలిందన్నారు. కానీ, ఆ రోజు రాత్రి అమ్మాయి ఏం చేప్పలేదని.. ఆటోలో తీసుకెళ్లారని సమాధానం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత ఇంజక్షన్ ఇచ్చారని చెప్పిందన్నారు. 7 సీటర్ ఆటోలో తనను తీసుకొచ్చారని.. అది ఓవైపు కాస్తా డ్యామేజ్ అయినట్టు కూడా యువతి చెప్పినట్టు సీపీ వెల్లడించారు. బాధితురాలి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఘట్కేసర్, కీసర పరిధిలోని ఆటో యూనియన్ వాళ్లను ఎంక్వైరీ చేసినట్టు చెప్పారు. ఆటో ఓ వైపు డ్యామేజ్ అయిన మొత్తం మూడు 7 సీటర్ ఆటోలను కూడా గుర్తించామన్నారు. ఆ ఆటోలకు సంబంధించిన డ్రైవర్ల ఫోటోలను అమ్మాయికి చూపిస్తే.. అందులో ఒకరు ఉన్నట్టు చెప్పిందన్నారు. దీంతో అమ్మాయి తల్లి.. మా అమ్మాయిని ఆటో డ్రైవర్లు వాళ్లు కిడ్నాప్ చేసినట్టు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసు నమోదు చేశారన్నారు.

ఈ కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు అమ్మాయిని ఆరా తీయగా.. తనను ఇద్దరు పట్టుకున్నారని రేప్ చేసినట్టు కూడా చెప్పిందన్నారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, కీసర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఏసీపీ, డీసీపీలు అమ్మాయిని వెంటనే మల్కాజ్‌గిరి ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అనంతరం రేప్ జరిగిందా లేదా అని నిర్ధారణ కోసం మెడికల్ టెస్టులు కూడా నిర్వహించారన్నారు. ఇదే సమయంలో అదుపులోకి తీసుకున్న అనుమానితులను విచారించామని చెప్పారు. దీంతో అసలు నిజం బయటపడిందని.. ఆ సమయంలో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న వారు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు తేలిందన్నారు. తుది విచారణలో భాగంగా 100 సీసీ టీవీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగిందన్నారు. దీంతో ఆటో డ్రైవర్ చెప్పిందే నిజమని ఇన్వెస్టిగేషన్ అధికారులు నిర్ధారణకొచ్చారన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అసలు ఆటో డ్రైవర్ అక్కడ లేనట్టు తేలిందన్నారు. అదే సమయంలో ఒక మల్టీఫ్లేక్స్‌, ఆ తర్వాత మద్యం సేవించడానికి బార్‌కు వెళ్లినట్టు తేలిందన్నారు. ఇందులో భాగంగానే సీసీ టీవీ ఫుటేజీలు టైమింగ్‌తో సహా వచ్చినట్టు సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.

మరోవైపు అసలు అమ్మాయి నిజం చెబుతుందా లేదా అని దర్యాప్తు చేశామన్నారు. యువతి అదే స్టోరీ మళ్లీ చెప్పిందన్నారు. దీంతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తే అది అబద్ధమనే తేలిందన్నారు. మొత్తం సీసీ ఫుటేజీని పరిశీలిస్తే సాయంత్రం 7.22 నిమిషాలకు అమ్మాయి సాధారణంగా కాలేజీ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు బయటపడ్డాయన్నారు. ఆ తర్వాత అటు ఇటు పరుగులు తీసి కిందపడిపోయిందని అందుకే గాయాలు అయినట్టు చెప్పారు. అసలు విసయం ఆరా తీస్తే ఇంటి నుంచి బయటకెళ్లాలని ఉందని.. ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో నుంచి వెళ్లగొడుతారని యువతి ఫేక్ స్టోరీ చెప్పినట్టు సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ముందు నుంచే కిడ్నాప్ ప్లాన్ వేసి ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యేందుకు చూసిందని కూడా తేలిసిందన్నారు. ఈ కేసులో కిడ్నాప్, కానీ, రేప్ కాని జరగలేదన్నారు. దిగాల్సిన బస్టాప్ వదిలేసి అక్కడా ఇక్కడా తిరిగి.. ఊరికే కాల్ చేస్తున్నారని స్పందించి తప్పుడు సమచారం ఇచ్చిందని సీపీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed