- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ పర్యటనకు రూట్ క్లియర్
దిశ, స్పోర్ట్స్ : సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియాకు ఉన్న పలు అడ్డంకులు తొలగిపోయాయి. న్యూజిలాండ్ జట్టుతో డబ్ల్యూటీఏ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడటానికి భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనున్నది. దాదాపు మూడున్నర నెలల పాటు టీమ్ ఇండియా క్రికెటర్లు అక్కడే గడపనున్నారు. కాగా, కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో బ్రిటన్ ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్ లిస్టులో పెట్టింది. ఒక వేళ ఎవరైనా వచ్చినా లండన్‌లో బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే కఠినమైన క్వారంటైన్‌లో ఒంటరిగా గడపాలనే నిబంధన ఉన్నది. దీంతో క్వారంటైన్ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని బీసీసీఐ కోరింది. టీమ్ ఇండియా క్రికెటర్లకు ఇండియాలోనే 10 రోజుల పాటు బయోబబుల్‌లో ఉంచుతున్నామని.. ఆ మేరకు ప్రభుత్వ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని బీసీసీఐ కోరింది. బ్రిటన్ ప్రభుత్వంతో ఈసీబీ కూడా సంప్రదింపులు జరపడంతో ప్రభుత్వ క్వారంటైన్ నుంచి భారత జట్టుకు మినహాయింపు లభించింది. ముంబై నుంచి భారత జట్టు నేరుగా లండన్ చేరుకొని అక్కడి నుంచి సౌతాంప్టన్ వెళ్లనున్నది. అక్కడే ఈసీబీ ఏర్పాటు చేసిన హోటల్‌లో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
24 నుంచి బయోబబుల్..
టీమ్ ఇండియా క్రికెటర్లు మే 19న (బుధవారం) ముంబై చేరుకోనున్నారు. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు కూడా బుధవారం ముంబై రానున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వీరిని పిక్ చేసుకోవడానికి చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. బెంగళూరు నుంచి వచ్చే ఆటగాళ్లు చెన్నై వెళ్లి విమానం ఎక్కాలని.. కోల్‌కతా నుంచి వచ్చే ఆటగాళ్లు కమర్షియల్ ఫ్లైట్‌లో ముంబై రావాలని బీసీసీఐ ఆదేశించింది. ముంబై చేరుకున్న ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మే 24 నుంచి కరోనా నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లందరూ బయోబబుల్‌లోకి వెళ్తారని బీసీసీఐ చెప్పింది. ముంబైకి చెందిన ఆటగాళ్లు నేరుగా 24వ తేదీన బయోబబుల్‌లోకి వెళ్లడానికి సడలింపు ఇవ్వనున్నారు. అయితే వారందరికీ ఇంటి వద్దనే కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరైనా క్రికెటర్ కరోనా పాజిటివ్ వస్తే ఇక ఆ క్రికెటర్ ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబైలో 10 రోజులు బయోబబుల్‌లో గడిపిన తర్వాత టీమ్ ఇండియా పురుష, మహిళా క్రికెటర్లు అందరూ ఒకే చార్టర్ ఫ్లైట్‌లో జూన్ 2న ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్తారు. జూన్ 3న సౌతాంప్టన్ చేరుకున్న తర్వాత మరోసారి క్రికెటర్లు బయోబబుల్‌లోకి వెళ్తారు.
ఇంగ్లాండులో రెండో డోసు..
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియా క్రికెటర్లు అందరూ కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. క్రికెటర్లు తప్పని సరిగా కోవిషీల్డ్ మాత్రమే వేయించుకోవాలని బీసీసీఐ సూచించింది. దీంతో క్రికెటర్లు అదే డోసు వేసుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ చేరిన తర్వాత ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనకా వారి వ్యాక్సిన్ వేయించుకోవడానికి మార్గం సుగమమైంది. ఇండియన్ క్రికెటర్లు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వ అధికారులు అంగీకరించినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, మూడున్నర నెలల పాటు ఇంగ్లాండ్‌లో ఉంటుండటంతో వారితో పాటు కుటుంబాలను తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అయితే బ్రిటన్ ప్రభుత్వం కేవలం టీమ్ ఇండియా క్రికెటర్లు, సిబ్బందికి మాత్రమే క్వారంటైన్ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. జట్టుతో పాటు వెళ్లే కుటుంబ సభ్యులకు కోవిడ్ నిబంధనల సడలింపు ఉండదని.. వాళ్లు తప్పని సరిగా బ్రిటన్ ప్రభుత్వ క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే వారికి కూడా సడలింపు ఇవ్వాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నది. మే 24 నుంచి కుటుంబ సభ్యులు కూడా బయోబబుల్‌లో ఉండనున్నారు.