రోజంతా గోడను చూస్తూ ఉండలేని పరిస్థితి!

by sudharani |
రోజంతా గోడను చూస్తూ ఉండలేని పరిస్థితి!
X

దిశ, వెబ్‌డెస్క్:
గత తొమ్మిది రోజుల నుంచి మహారాష్ట్రలో మురికి వాడల్లో ఉండే వారి పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో నివసించే వారి ఇబ్బందులు చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్న పరిస్థితి. థానేలో 100 చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న దిగంబర్, దినేష్‌ల స్థితి క్వారంటైన్ కారణంగా దయనీయంగా మారింది.

వర్లిపడ మురికివాడలో ఉంటున్న వీళ్లద్దరి గత తొమ్మిది రోజులుగా గోడను చూస్తూ కాలం గడుపుతున్నారు. రేకుల పైకప్పు ఉన్న ఈ గదిలో వండుకోవడం, పడుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. కనీసం కదలడానికి కూడా ఇబ్బందే. ఒకరు కాళ్లు చాపితే, మరొకరు కాళ్లు దగ్గర పెట్టుకుని కూర్చోవాల్సి వస్తోందని దినేష్ వాపోయాడు. ఇరవై ఏళ్ల క్రితం ముంబైకి బిహార్ నుంచి వలస వచ్చిన దిగంబర్ గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని చెబుతున్నాడు.

పొద్దున ఒక హోటళ్లో, సాయంత్రం ఒక ఆటస్థలంలో పనిచేస్తూ నెలకు రూ. 17000 సంపాదించే తనకు ఈ క్వారంటైన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నాడు. జనతా కర్ఫ్యూకి ముందురోజే తాను ఇంటికి వెళ్లకపోవడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని బాధపడుతున్నాడు. పరిస్థితి ఇలాగే ఉంటే తనకు ఇంట్లోనే పిచ్చెక్కే ప్రమాదముందని అంటున్నాడు. కనీసం మొబైల్ ఫోన్ ఉండటం వల్ల అంతో ఇంతో కాలక్షేపం అవుతోందని చెబుతున్నాడు.

ఇక దినేష్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. రోజులో కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే బయటికి అడుగుపెడుతున్నామని అన్నాడు. పోలీసులు కొడుతున్న కారణంగా కిందకి దిగాలంటే భయంగా ఉందని చెబుతున్నాడు.

కేవలం వీరు మాత్రమే కాదు దాదాపు స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న అందరి పరిస్థితి ఇదే. వారు రోజంతా ఇంట్లో గోడను చూస్తూ బతుకుతున్నప్పటికీ వారి కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే వాళ్లందరూ ఉపయోగించేది ఒకటే కమ్యూనిటీ టాయ్‌లెట్. ఇంత కష్టపడి క్వారంటైన్ పాటిస్తున్నప్పటికీ తమకు వ్యాధి భయం ఉందనే విషయం మరింత కంగారు పెడుతోందని వారు బాధపడుతున్నారు.

Tags: Corona, COVID 19, Thane, Mumbai, slums, quarantine problems

Advertisement

Next Story