World University Rankings : వరల్డ్ టాప్ 200లో భారత యూనివర్సిటీలు

by Anukaran |   ( Updated:2021-06-09 09:17:29.0  )
World University Rankings : వరల్డ్ టాప్ 200లో భారత యూనివర్సిటీలు
X

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 200 మేటి యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి మూడు యూనివర్సిటీలు చోటుదక్కించుకున్నాయి. ఐఐటీ బాంబే(177వ స్థానం), ఐఐటీ ఢిల్లీ(185వ), ఐఐఎస్‌సీ బెంగళూరు(186వ)లు ఈ జాబితాలో ఉన్నాయి. ఐఐటీ బాంబే మనదేశం నుంచి తొలిస్థానంలో నిలిచిన ఓవరాల్‌గా జాబితాలో గతేడాది కంటే ఐదు స్థానాలు వెనుకబడింది. క్వాక్వరెలీ సైమండ్స్(క్యూఎస్) బుధవారం 2022 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్‌‌లను విడుదల చేసింది. ఇందులో భారత యూనివర్సిటీల సంఖ్యలో పెరుగుదల కనిపించలేదు. గత ఐదేళ్లుగా అంటే 2017 నుంచి టాప్ 200 జాబితాలో మూడు భారత విద్యా సంస్థలకే చోటుదక్కుతూ వస్తున్నది. తాజాగా విడుదల చేసిన 2022 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితాలోనూ మూడే సంస్థలున్నాయి.

ఇండియాలో ఐఐటీ బాంబే.. ది బెస్ట్

భారత దేశంలో బెస్ట్ హయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌గా వరుసగా నాలుగోసారి ఐఐటీ బాంబే నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్‌సీ బెంగళూరులున్నాయి. కాగా, వరల్డ్‌లో టాప్ రీసెర్చ్ యూనివర్సిటీగా ఐఐఎస్‌సీ బెంగళూరు నిలివడం గమనార్హం.

టాప్ 1000లోనూ అదే తీరు

టాప్ 1000 జాబితాలోనూ భారత విద్యా సంస్థల సంఖ్యలో పెద్ద మార్పేమీ లేదు. కొన్నేళ్లుగా 22 నుంచి 24 మధ్యలోనే ఈ సంఖ్య ఉంటున్నది. తాజాగా 22 యూనివర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. గతేడాది 21 విద్యా సంస్థలుండగా, 2020లో 23 విద్యా సంస్థలు, 2019లో 24 విద్యా సంస్థలు, 2018లో 20 విద్యా సంస్థలు చోటుదక్కించుకున్నాయి.

విశ్వగురువుగా భారత్: కేంద్ర విద్యా శాఖ మంత్రి

టాప్ 200లో చోటుదక్కిన ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్‌సీ బెంగళూరులను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రశంసించారు. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్‌లో భారత్ కీలక అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. విశ్వగురువుగా ఎదుగుతున్నదని వివరించారు.

Advertisement

Next Story