థాయ్‌లాండ్ ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం

by Shyam |
థాయ్‌లాండ్ ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రచానోక్ ఇంతనాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 13-21, 9-21 వరుస గేమ్స్‌లో సింధు ఓటమిపాలయ్యింది. మ్యాచ్ ప్రారంభం నుంచి పీవీ సింధుపై రచానోక్ పై చేయి సాధించింది. అద్భుతమైన ర్యాలీలు, డ్రాప్ షాట్లు, స్మాష్‌లతో అలరించింది. పీవీ సింధు చేసిన అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ వల్లే ఓటమిని కోరి తెచ్చుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ నెగ్గిన తర్వాత పీవీ సింధు మేజర్ టోర్నీలలో ఇంత వరకు టైటిల్ సాధించలేదు. కరోనా తర్వాత ప్రారంభమైన తొలి టోర్నీ యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్‌లో పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యింది.

తాజాగా టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడి నిష్క్రమించింది.’అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసి ప్రత్యర్థికి సులువైన పాయింట్లు ఇచ్చాను. ఈ రోజు సరైన ఆటను ఆడలేదు’ అని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడిపోయాడు. డెన్మార్క్‌కు చెందిన ఆండ్రెస్ ఆంటొసెన్ చేతిలో 13-21, 21-19, 20-22 తేడాతో ఓడిపోయాడు. సమీర్ ఆటలో చివరి వరకు పోరాడినా చివరకు ఆండ్రెస్‌దే పైచేయి అయ్యింది. పీవీ సింధు, సమీర్ ఓటమితో థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ల సింగిల్స్ ప్రయాణం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, అశ్వని పొన్నప్ప పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టీలు తర్వాతి రౌండ్‌లోకి ప్రవేశించారు.

Advertisement

Next Story