వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

by Shyam |
వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వ్యూహాలు చేస్తున్నారు. ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే బాధ్యత తమదేనని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లు రైతులు ఒకే దగ్గర గుమ్మిగూడకుండా టోకెన్లు ఇస్తున్నారు. అంతేకాకుండా రైతు వద్దకే కాంటాను తీసుకెళ్లి ధాన్యం సేకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న గ్రామంలో సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 18 కేంద్రాలు ప్రధానమైనవిగా గుర్తించారు. వీటితో కలిపి అవసరమైన చోట 130 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 211 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రెండు జిల్లాలో లక్షా74 వేల దిగుబడి…

రంగారెడ్డిలో 89,502, వికారాబాద్ లో 85 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రంగారెడ్డిలో 45 వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్ లో 56 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా మార్కెటింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా సాగు, దిగుబడి అంచనా ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ, గతంలో ఎంత సాగుకు, దిగుబడికి సేకరణ ఎంత జరిగిందో.. దాంతో 10 శాతం అదనంగా అంచనా వేసుకొని సేకరణకు ఏర్పాట్లు చేస్తారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడైనా సాగు దిగుబడి మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయదు. ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నెల 20 తరువాతే..

లాక్ డౌన్ నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎక్కడైనా కొంత సమయం ఆధారంగానే వరి ధాన్యం సేకరించాలి. అందుకోసం 3 కేంద్రాలకు కలిపి లేదా వరి సాగు కలిగిన 3 గ్రామాలకు కలిపి ఒక రోజు ధాన్యం సేకరించాలి. ఆ సేకరణ కూడా ఉదయం 11 గంటల లోపు పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 తర్వాతే ధాన్యం సేకరణ జరగనుంది.

Tags: rice grain, purchase, officers, Formers, Rangareddy

Advertisement

Next Story