అక్కడ.. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్

by  |   ( Updated:2020-08-11 03:18:06.0  )
అక్కడ.. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచాన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది.. ఇంటినే ప్రపంచంగా మార్చేసింది. ఇంటి పనులు తప్ప.. ఆఫీస్ వర్క్, పిల్లల చదువులు, ఇంటిల్లిపాది కలిసి ఎంజాయ్ చేసే సినిమాలు.. అన్నీ డిజిటిల్‌ తెరపైనే చకచకా సాగిపోతున్నాయి. అయితే ఓ పక్క కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికీ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం లేదు. ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కొనసాగుతోంది కానీ, అందుకు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్థోమత అందరి తల్లిదండ్రులకు లేకపోవడంతో వారు విద్యలో వెనుకబడుతున్నారన్నది తెలిసిన విషయమే. దీని పరిష్కారంగా పంజాబ్ ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

‘కెప్టెన్ స్మార్ట్ కనెక్ట్’ పేరుతో పంజాబ్ ప్రభుత్వం.. సర్కారీ కాలేజీల్లో చదువుతున్న 11, 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆగస్టు 12న యువజన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఈ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టనున్నామని, మొత్తంగా నవంబర్ వరకు 1.78 లక్షల ఫోన్‌లు పంపిణీ చేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా వల్ల.. పబ్లిక్ గ్యాథరింగ్ ఎక్కువగా ఉండకుండా చూసేందుకు పంజాబ్, చండీఘడ్‌లోని 26 డిఫరెంట్ లొకేషన్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

ప్రతి డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్‌, ప్రధాన పట్ణణాలు, సిటీల్లో కేవలం 15 మంది విద్యార్థులతో లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు. తొలిరోజు మొత్తంగా 50 వేల ఫోన్లు అందజేస్తున్నారు. 11, 12 తరగతులకు సంబంధించిన పాఠాలతో ‘ఈ సేవా’ యాప్ ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నారు. పంజాబ్‌ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. పేద విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు.. ఏ విద్యార్థి కూడా విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story