నాకు ఇంత సెక్యూరిటీ అవసరం లేదు.. ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2021-09-23 23:23:09.0  )
Punjab Chief Minister Charanjit Singh
X

దిశ, వెబ్‌డెస్క్: చాలామంది నేతలు ముఖ్యమంత్రి కాగానే వారి చుట్టూ భారీగా భద్రత సిబ్బంది, ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక ఏర్పాట్లు, భారీ కాన్వాయ్ ఉండేలా చూసుకుంటారు. ఇలా భారీ భద్రత కోరుకునే ముఖ్యమంత్రులనే మనం ఎక్కువగా చూశాం. అయితే, కొందరు మాత్రమే వారు ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. నిరాడంబరంగా గడుపుతుంటారు. ప్రభుత్వ వనరులను వృథా చేయకుండా ఉండటానికి కృషి చేస్తారు. ఇలాంటి వ్యక్తే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్‌ సింగ్ చన్నీ. ఈయన ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

అయితే.. గతంలో పంజాబ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఏవిధంగా అయితే భద్రతా సిబ్బందిని, కాన్వాయ్‌ని ఏర్పాటు చేశారో అదేవిధంగానే ఈయనకు కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఆయన పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. తనకు అంతమంది భద్రతా సిబ్బంది, భారీ కాన్వాయ్ అవసరంలేదని.. వాటిని తగ్గించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. తనకు రక్షణగా 1000 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయానని, ప్రభుత్వ సొమ్మును వృథా చేయరాదని, తాను కేవలం సామాన్యుడినని, తన రాష్ట్రంలో తనకు ఎవరూ ఏ హానీ తలబెట్టబోరని పోలీసులకు చెబుతూ వెంటనే తగ్గించాలని సూచించినట్లు సమాచారం.

తాజాగా.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆ నిధులను ప్రజాసంక్షేమం, బలహీనవర్గాలు, వెనుకబడివారు, నిరుపేదల కోసం ఖర్చు చేయాలని చెప్పినట్లు చన్నీ చెప్పారు. తాను వీఐపీని కాదని, నేను కూడా మీలాగే సాధారణ వ్యక్తినని, తనకు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని చెప్పారు. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిని చూసి మిగతా సీఎంలు కూడా నేర్చుకోవాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.

Advertisement

Next Story