- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పప్పు ధాన్యాలు.. హెల్త్‌కి బెస్ట్
దిశ, న్యూస్ బ్యూరో: సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఏమిటి? పాలకులు చెప్పిన పంటలను వేయడమేనా? భూములను బట్టి పంటలను ఎంచుకోవాలా.. విరివిగా పత్తి సాగు మంచిదేనా? అన్న సందేహం మొదలైంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయడం శ్రేయస్కరమన్నఅభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. పత్తి వంటి వాణిజ్య పంటల రాకతో తృణధాన్యాల పట్ల రైతులు అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పత్తి వంటి పంటలనే ప్రోత్సహిస్తుండడంతో సంప్రదాయ పంటల గురించి ఆలోచించడం లేదు. తృణధాన్యాల దిగుబడి తగ్గిపోవడం, పోషక విలువలపై ప్రచారం నేపథ్యంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ పంటల సాగును ప్రోత్సహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా గిట్టుబాటు ధర సాధ్యమేనని వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా పంటల సాగును ఎంచుకోవాల్సిందే. మూస పద్ధతిలో వ్యవసాయం రైతుకు చేటు. ప్రకృతికి విఘాతం. అందుకే మార్కెట్ డిమాండ్‌కు తగిన పంటల సాగుతోనే రైతన్నకు ప్రయోజనం. పక్క రైతును ఆదర్శంగా తీసుకుంటే అసలుకే మోసం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. దానికింకా వ్యాక్సిన్ కూడా కనిపెట్టలేదు. కానీ దాన్ని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి ఉండాలి. అంటే దానికి కావాల్సిన పోషకాలు కలిగిన ఆహారమే తీసుకోవాలి. అవెక్కడ? అంటే పాత పంటల రూపంలోనే అత్యధికం. అందుకే ఈ మధ్యకాలంలో తృణధాన్యాల వైపు చూపు మళ్లింది. కరోనా కంటే ముందు కూడా కాస్త చైతన్యం వెల్లివిరిసింది. కానీ ఇప్పుడీ వైరస్ బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రైతన్న సాగుకు తృణాధాన్యాలే మేలు.. లాభం అధికం.
సారవంతమైన నేలలు
"తెలంగాణ నేలలు ఎంతో సారవంతమైనవి. అందుకే ఒక్క ఎకరానికి 42 టన్నుల (అనాబ్-ఈ-షాహీ) దిగుబడిని సాధించారు. ఇది దేదీప్యమానమైన దిగుబడి (స్పెక్టాక్యులర్ ఈల్డ్), జీవ సంబంధమైన అద్భుతం(బయోలాజికల్ వండర్)".. అని ఓల్మో రకం ద్రాక్ష సృష్టికర్త, కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వీటీకల్చర్ శాస్త్రవేత్త డా.హరోల్డ్ ఓల్మో ప్రశంసించారు. 1969 లో హైదరాబాద్ ప్రాంతంలో పర్యటించిన ఈ శాస్త్రవేత్త తన అనేక పరిశోధన గ్రంథాల్లో తెలిపినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌లో పని చేసిన ఉద్యానవన శాస్త్రవేత్త కృష్ణలాల్ చద్ధా ధ్రువీకరించారు. ఈ అంశానికి సంబంధించిన అనేక వివరాలు రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. అంతటి సారవంతమైన తెలంగాణ నేలలు నేడు వాణిజ్య పంటలతో బోరుమంటున్నాయి. ఐతే సారాన్ని కోల్పోయిన ఉదంతాలను గుర్తెరగాలి. తృణ ధాన్యాలపై కార్పొరేట్ సంస్థల హస్తగతమైన లోపభూయిష్ట మార్కెట్ విధానాల్లో మార్పులు తీసుకురావాలి. రెండున్నర దశాబ్దాల క్రితం 65 రోజుల్లో పంట చేతికొచ్చే పప్పుధాన్యాల సాగులో ముందుండేది. వర్షాధార పంటలకు ఎలాంటి ఢోకా లేకుండా ఉండేది. ఆరోగ్యాన్ని కాపాడే పంటలకు బదులుగా వాణిజ్య పంటల వైపే రైతాంగం మొగ్గు చూపుతోందని స్పష్టమవుతోంది. ఇకనైనా తృణ ధాన్యాల వైపు అడుగులు వేయాలి.
మార్కెట్లో కొత్త పేర్లు
ఉలవచారు బిర్యానీ స్పెషల్ అంటూ కూకట్‌పల్లిలో ఓ రెస్టారెంటే నడుస్తోంది. అక్కడ తినాలంటే అరగంటైనా వేచి ఉండాలి. రాగి మాల్ట్, జొన్న పిండి, మొక్క జొన్న పిండి వంటి పదార్ధాలను కొత్త కొత్త పేర్లతో బహుళ జాతి కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఏ పదో పరకో అనుకుంటే పొరపాటే.. అందమైన ప్యాకింగ్‌తో పదింతల ధరలను వడ్డించేస్తున్నాయి. పొద్దున లేచి నీళ్లల్లో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదంటూ అనేక ఉత్పత్తులు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అవన్నీ అర్ధ శతాబ్ధం క్రితం మనోళ్లు ఛాయ్, కాఫీకి బదులుగా రోజూ తీసుకున్నవే. బడా కంపెనీలు అంబలి, గంజికి బదులుగా జావా అంటూ కొత్తగా పిలుస్తూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నాయి. ప్రస్తుతం సంపన్న వర్గాల ఇండ్లల్లో తృణ ధాన్యాల వినియోగం బాగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తృణ ధాన్యాల వినియోగం నానాటికీ పెరుగుతున్నది. ఎన్నో హోటళ్లు మిల్లెట్స్ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటవుతున్నాయి. హైటెక్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు కూడా దర్శనమిస్తున్నాయి.
చేలోనే విక్రయిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి
ఎనిమిదేండ్లుగా తృణధాన్యాల సాగుతో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేటకు చెందిన నేమూరి విష్ణువర్ధన్‌రెడ్డి అధిక లాభాలు గడిస్తున్నారు. మార్కెటింగ్ చింత లేదు. ఎవరినీ బతిమిలాడే పని లేదు. తృణధాన్యాలపై మక్కువ పెంచుకున్న ఔత్సాహికులు పొలం దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పండించిన పంటకు ముందుగానే డిమాండ్ పలుకుతోంది. మాకే అమ్మాలంటూ పట్నంవాసులు క్యూ కడుతున్నారు. అందుకే ఆయన చాలా ఏండ్లుగా కొర్రలు, అండుకొర్రలు, పచ్చజొన్నల సాగుతో హాయిగా లాభాలు గడిస్తున్నారు. అంతే కాదు! అంతర పంటగా కంది కూడానూ. మిగతా రైతుల మాదిరిగా ఎలాంటి చింత లేకుండా అధిక దిగుబడిని, అధిక లాభాలను గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తనతో పాటు నలుగురు రైతులను సంప్రదాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నారు. గతేడాది మహబూబ్‌నగర్‌లో ఓ సదస్సు జరిగితే 5 క్వింటాళ్ల కొర్రలను విత్తనాలుగా మలిచి రైతులకు కిలో రూ.100కే విక్రయించారు. తన మాదిరిగానే రైతులంతా పాత పంటల వైపు నడవాలని కోరుకుంటున్నారు. వర్షాధార పంటలు, వాణిజ్య పంటల సాగుపైనే మక్కువ చూపించడం ద్వారా రైతులకు, ప్రకృతికి నష్టమేనంటున్నారు.
ఏం చేశారు?
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట, చౌదరిగూడెం మండలం తుమ్మలపల్లిలో 17 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9 ఎకరాల్లో తృణధాన్యాలే పండిస్తున్నారు. ప్రధానంగా కొర్రలు, అండుకొర్రలు, పచ్చజొన్నలు సాగు చేస్తున్నారు. అంతరపంటగా కంది వేస్తున్నారు. ఎకరాకు కొర్రలు 9 క్వింటాళ్లు, అండుకొర్రలు 9 క్వింటాళ్లు, పచ్చజొన్నలు 12 క్వింటాళ్లు వంతున పండుతున్నాయి. కందులు కూడా బాగానే దిగుబడినిస్తున్నాయి. నీటి తడి పెట్టాలన్న బాధ లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాద్‌నగర్ ప్రాంతాల్లో ఎలాగూ భూగర్భ జలాలు అంతరించిన నేపథ్యంలో బోరుబావుల్లో నీళ్లు నామమాత్రమే. ఇప్పటికైతే సాగు నీటి వనరులేవీ అందుబాటులోకి రాలేదు. ఐతే వర్షాధారిత పంటలేసినా, నీటి తడి తప్పనిసరిగా పెట్టాల్సిన పంటలేసినా వాతావరణం అనుకూలించకపోతే కష్టమే. అదే ఇక్కడి వాతావరణానికి, నేల స్వభావానికి అనుకూలంగా ఈ సంప్రదాయ ధాన్యపు పంటలు వేయడమే ఉత్తమమని విష్ణువర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటివే పండించాలి. మా దగ్గరికి హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తారన్నారు. ముందుగానే మాకు ఇవ్వాలంటూ ఫోన్లు చేసేవారున్నారు. ఇప్పుడు తృణధాన్యాలపై చాలా మందికి అవగాహన కలిగింది. వీటిని తినడం వల్లే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడీ కరోనా వైరస్ నేపధ్యంలో మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగితే మరింత లాభం
పొలం దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.. ప్రాసెసింగ్ చేసిన తర్వాత విక్రయిస్తే రైతులకు లాభం రెట్టింపు అవుతుందని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలోనే మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా తృణ ధాన్యాలను ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, పిండిగా మార్చి విక్రయిస్తే లాభాలు రెట్టింపవుతాయి. ఇప్పుడు బేకరీల్లో పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగితే రైతులకు ఇంకింత ప్రయోజనకారిగా అవుతుందన్నారు.
గుర్తెరిగి సాగు చేస్తున్నాం: నేనూరి విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు
మా నాన్న, తాతలు ఈ పంటలనే సాగు చేసేవాళ్లు. కాలానుగుణంగా ఈ పంటలన్నీ కనుమరుగయ్యాయి. ప్రొ.ఖాదర్‌వలీ వంటి వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేను కూడా ఆయన స్ఫూర్తితోనే సాగు చేసి లాభాలు గడిస్తున్నా. సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేయడం ద్వారా పెద్ద పెట్టుబడులేవీ అవసరం లేవు. పైగా పని కూడా తక్కువ. నాకున్న భూమిలో సగానికి పైగా తృణధాన్యాల సాగుకే కేటాయించా. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తృణధాన్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.