కొత్త గ్రామ పంచాయతీలో.. కోటి కష్టాలు

by Shyam |
Venkateshwarlapally Grama Panchayat
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: ‘‘అద్దె భవనం. అరకొర వసతులు. ఫర్నీచర్ లేదు. అభివృద్ధికి సరిపడా నిధులు రావు. వచ్చే కొద్దిపాటి నిధులతో సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి. తాత్కాలిక సమస్యల పరిష్కారానికి కూడా ఈ నిధులు సరిపోవడం లేదు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, సొంత భవనాలు, ఫర్నీచర్ తదితర వసతులను సమకూర్చుకోలేక, కొత్త గ్రామపంచాయతీ పాలకవర్గంలో ఎన్నికైన మేము కోటి కష్టాలు అనుభవిస్తున్నాము.’’ అని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన 30 గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బాధలు వెల్లడిస్తున్నారు.

Venkateshwarlapally Grama Panchayat

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొత్తగా 30 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అందులో స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో 3, చిల్పూర్ మండలంలో 3, రఘునాథపల్లి మండలంలో 16, జఫర్గడ్ మండలంలో 4, లింగాల ఘనపురం మండలంలో 4 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. జనవరి 30, 2019న సర్పంచ్‌గా ఎన్నికై, ఆయా కొత్త గ్రామపంచాయతీ సర్పంచులుగా బాధ్యతలు చేపట్టి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా.. కొత్త జీపీలకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా అరకొర వసతులు, అద్దె భవనాల్లో గ్రామ పంచాయతీ విధులు నిర్వహిస్తున్నారు. నిధులు లేకున్నా విధులు తప్పవు అన్నట్లు జనాభా ప్రాతిపదికన వచ్చే కొద్దిపాటి ఆదాయంతో నిప్పుల మీద నీళ్లు చల్లి స్థానిక సమస్యలు తాత్కాలికంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలపై ఆధారపడ్డారు. ఇరుకు గదుల్లో సర్పంచ్ సహా గౌరవ సభ్యులు కూర్చునేందుకు ఫర్నీచర్ కూడా లేకపోవడం గమనార్హం. దీంతో మూడు నెలలకు ఒకసారి నిర్వహించే గ్రామ సభలు సైతం సక్రమంగా నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనాభా ప్రాతిపదికన వచ్చే నిధులు తప్ప అదనంగా నిధులు రాకపోవడంతో పంచాయతీ పరిధిలోని మోరీలు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు మొదలైన పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పులు చేయక తప్పడం లేదు :

కొత్త గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. వచ్చే కొద్దిపాటి నిధులు జీతాలకు, రిపేరింగ్‌లకు సరిపోతున్నాయి. ఆఫీసు కట్టాలన్నా, సీసీ రోడ్డు వేయాలన్నా, సైడు కాలువ కట్టాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలన్నా అప్పులు చేయక తప్పడం లేదు. – వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ తోకల దివాకర్ రెడ్డి

ప్రత్యేక నిధులు కావాల్సిందే :

గ్రామ పంచాయతీకి పక్కా భవనం కట్టాలి. సీసీ రోడ్లు వేయించాలి. మురికి కాలువలు కట్టించాలి. సరిపడా నిధులు రాక తండా ప్రజలు సమస్యలు తీర్చలేక పోతున్నాను. అధికారులు, ప్రభుత్వం స్పందించి కొత్త గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. – జిట్టెగూడెం సర్పంచ్ మాలోత్ లలిత

Advertisement

Next Story

Most Viewed