‘పీఎస్ 5’ను ష్రెడ్డర్‌లో వేశాడు!

by Shyam |
‘పీఎస్ 5’ను ష్రెడ్డర్‌లో వేశాడు!
X

దిశ, వెబ్‌డెస్క్: పీఎస్ 5 సొంతం చేసుకుని అందులో గేమ్స్ ఆడాలని ఇప్పుడు ప్రతి గేమర్ కలలు కంటున్నాడు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతున్నారు. ప్లే స్టేషన్ 5కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దాదాపు అందరు గేమర్లు పీఎస్5తో గేమ్స్ ఆడటానికి ఆత్రుతగా ఉంటే, ఒక యూట్యూబర్ మాత్రం పీఎస్5 కొని, దానితో గేమ్‌లు ఆడకుండా, దాన్ని ఇండస్ట్రియల్ ష్రెడ్డర్‌లో పడేసి వీడియో తీశాడు. కెప్టెన్ క్రంచ్ ఎక్స్‌పరిమెంట్స్ పేరుతో ఉన్న ఈ యూట్యూబ్ చానల్‌లో పీఎస్5 కన్సోల్‌తో పాటు దాని కంట్రోలర్, పవర్ కేబుల్స్, బుక్స్, అది వచ్చిన బాక్స్‌లను కూడా ష్రెడ్డర్‌లో పడేశాడు.

అది చూసిన వాళ్లందరూ తమ కోపాన్ని కామెంట్లలో వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ ఉత్పత్తి దొరకడమే అదృష్టంగా భావిస్తున్న ఇలాంటి తరుణంలో.. ఇలా కొన్న తర్వాత దాన్ని ష్రెడ్డర్‌లో వేసి ముక్కలు ముక్కలు చేయడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తుండటం గమనార్హం. ఓ వైపు తిడుతూ కామెంట్‌లు చేస్తూనే మరోవైపు వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా ష్రెడ్ చేయడానికి బదులు ఎవరికైనా ఇస్తే కనీసం వాళ్లైనా ఆడుకుంటారు కదా అని కెప్టెన్ క్రంచ్‌కు హితబోధ చేస్తున్నారు. ఈ సోనీ పీఎస్‌5 ఇంకా భారతదేశంలో విడుదల కాలేదు. అయితే పలు దేశాల్లో విడుదలైనప్పటికీ డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రీసెల్లర్‌లు ముందే ఆన్‌లైన్‌లో పెద్దమొత్తంలో కొనేసుకుని దాన్ని ఈబే, అమెజాన్ మార్కెట్‌ప్లేస్ వెబ్‌సైట్‌లలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story