సర్కారు వైద్యానికే ‘సై’

by Shyam |
సర్కారు వైద్యానికే ‘సై’
X

దిశ, కరీంనగర్: రోగులకు మెరుగైన సేవలందించడంలో జిల్లాలోని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందుంది. ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా పనిచేస్తూ ప్రజల మన్ననలందుకుంటోంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సర్కారు దవాఖానా రూపురేఖలనే మార్చేశారు. నిజాంకాలంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిపై ఈటల ప్రత్యేక శ్రద్ధ వహించి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. హుజురాబాద్ పరిధిలోని సుమారు 200 గ్రామాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలను సమకూర్చడంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రుల వైపు చూడటం లేదు. 16 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్న ఈ దవాఖానాలో డెలివరీ కేసులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. నెలలో 150 మంది గర్భిణులు ఈ ఆసుపత్రిలో డెలివరీ అవుతుండటమే దీనికి నిదర్శనం. డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరే మహిళలకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయడంతో పాటు ఆరోగ్య శ్రీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ దవాఖానాలో గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, అనస్థీషియా, పెడియాట్రిక్, ఆర్థో, ఈఎన్‌టీ, డెంటల్, యునాని, లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ విభాగాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్టర్లను కూడా నియమించారు. వైద్యుల పర్యవేక్షణలో రోగులకు నిరంతరం సేవలు అందుతున్నాయి. డయాలసిస్, ఐసీయూ, గుండెపోటు విభాగంలోనూ త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 24 గంటలపాటు వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అత్యవసర సేవల కోసం ముగ్గురు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ప్రసవాలు, గర్భసంచి, హెర్నియా, గడ్డలు, రాళ్లు, కడుపునొప్పి లాంటి ఆపరేషన్లు కూడా ఈ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హుజురాబాద్ సర్కారు దవాఖానా అంటేనే వెనకడుగు వేసినవారు ప్రస్తుతం ఇక్కడే వైద్యం చేయించుకునేందుకు మొగ్గుచూపుతున్నారంటే సేవలు ఎంతమేర విస్తరించాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed