‘ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి’

by Shyam |   ( Updated:2021-12-17 05:02:08.0  )
‘ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి’
X

దిశ,వనపర్తి : ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణ్,ఆది డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ పీడీ ఎస్‌యూ ఆధ్వర్యంలో ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ చౌరస్తాలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణి, జిల్లా కార్యదర్శి ఎం.ఆది, పీడీ ఎస్‌యూ జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు గణేష్, వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణాలో నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 51 శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం, పాసైన విద్యార్థులకు కూడా అతి తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డు వైఫల్యమే అన్నారు. కరోనా అనంతరం అతి తక్కువ సమయంలో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించి విద్యార్థులకు ప్రమోట్ చేయకుండా, పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కావడం సిగ్గుచేటన్నారు.

గతంలో ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలతో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డ్, మళ్లీ అదే తప్పు చేసిందన్నారు. విద్యార్థులందరినీ ఫెయిల్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఆత్మహత్యలకు కారణం అవుతుందనీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీసం పాస్ మార్కులు ఇవ్వాలని,తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు వెంటనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఆంజనేయులు, రవి, వినయ్, రాజు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story