- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి 39 ఏళ్లు!
దిశ, ఆదిలాబాద్: అది ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి. ఆ రోజు తెల్లవారుజాము నుంచే అక్కడికి ఆదివాసులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకల్లా వేలాది మంది ఆదివాసులు తరలివచ్చారు. ఇలా 1981 ఏప్రిల్ 20న గిరిజనులతో ఇంద్రవెల్లి జనసంద్రమైంది. జల్… జంగల్… జమీన్..! జననినాదమైంది. ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ పోరాట పటిమ స్ఫూర్తిగా ఆదిమ గిరిజనులంతా అడవిపై హక్కు కోసం ఇంద్రవెల్లి చేరుకున్నారు.
భూమి కోసం పోరాటం, విముక్తి కోసం పోరాటం అన్న నినాదంతో భారీ సభకు ప్రయత్నించిన ఆదివాసుల పోరాటం అప్పటి పీపుల్స్ వార్ (ప్రస్తుతం మావోయిస్టు) పార్టీ ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిక మేరకు పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఇంద్రవెల్లికి తరలివచ్చిన గిరిజన జన జాతర చూసి పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. అప్పటికే ఆదివాసుల ఐక్యతను దెబ్బతీయాలన్న వ్యూహంతో తెర వెనక నుంచి కుట్రదారుల ఒత్తిళ్ళు ప్రభుత్వంపై మొదలయ్యాయి.
పోలీస్‌తో గొడవ మొదలై…
వేలాదిగా తరలివచ్చిన ఆదిమ గిరిజనుల జనసందోహాన్ని చూసి పాలకుల్లో అప్పటికే ఆందోళన మొదలైంది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో గోండు జాతికి చెందిన ఓ మహిళ.. సభకు భద్రత కోసం వచ్చిన ఓ పోలీస్‌పై విరుచుకుపడింది. ఇలా మొదలైన ఆ గొడవ కాల్పుల వరకు దారితీసింది. దీంతో సభలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు ఉన్నారని, ఇది ఆదివాసుల ఉద్యమం కాదని, నక్సలైట్ల సభ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అప్పటి పోలీసులు విచక్షణారహితంగా గిరిజనులపై కాల్పులకు దిగారు. అధికారిక లెక్కల ప్రకారం 13 మంది గిరిజనులు చనిపోయారని చెప్పినా… మృతుల సంఖ్య ఎక్కువగానే ఉందని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తూ వస్తున్నారు. భూమికోసం, అడవిపై హక్కుల కోసం పోరాడుతున్న గిరిజనులకు దశాబ్దాలుగా హక్కులు దక్కడం లేదు. ఈ ఇంద్రవెల్లి గాయానికి మాత్రం అప్పుడే 39 ఏళ్ళు నిండాయి.
నెత్తుటి గాయానికి అత్తరు పూతలు…
1981లో జరిగిన ఇంద్రవెల్లి ఘటన తర్వాత ఆదివాసుల ఐక్యత మరింత పెరుగుతూ వచ్చింది. ఇంద్రవెల్లిలో అమరవీరుల చిహ్నంగా వారి స్థూపాన్ని నిర్మించారు. దీంతో అడవుల్లో నక్సలైట్ల ఉనికి, ప్రభావం రెట్టింపు అయ్యాయి. “పొరకల సార్” ల పేరిట నక్సలైట్ ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊపందుకున్న ది. అయితే 1986లో ఇంద్రవెల్లిలో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీనిపై ఆదిలాబాద్ అడవుల్లో భారీ అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆదివాసుల సమగ్రతను దెబ్బ తీస్తున్నారని అప్పటి అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. దీంతో ఐటీడీఏ నిధులతో మళ్లీ స్థూపం నిర్మించారు. ఆ స్థూపానికి తెల్లని రంగు వేయడంతో దాన్ని కూడా ఆదివాసులు నిరసించి ఎరుపు రంగు వేసే వరకు పట్టుబట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20వ తేదీన అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుతూ వస్తున్నారు. కాగా, 1991లో పీపుల్స్ వార్‌పై మళ్లీ నిషేధం ప్రకటించడంతో అప్పటి నుంచి అక్కడ ఆ సంస్మరణ సభను నిర్వహించేందుకు అనుమతించడం లేదు. ఏప్రిల్ 20 కి అటు ఇటు నాలుగు రోజులపాటు ఇంద్రవెల్లిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. సోషలిస్ట్ నేత జార్జి ఫెర్నాండెజ్‌తోపాటు అనేక మంది నేతలు ఇంద్రవెల్లి స్థూపాన్ని అప్పట్లో సందర్శించారు. ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావ్ నేతృత్వంలో ఆదిమ గిరిజన హక్కుల వేదికైన తుడుం దెబ్బ ఇక్కడనే పురుడు పోసుకున్నది.
ఇంద్రవెల్లిలో నిషేధాజ్ఞలు…
రేపు (20న) ఇంద్రవెల్లిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. కేవలం ఐదుగురు మాత్రమే సంస్మరణ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు ఉట్నూర్ డీఎస్పీ తెలిపారు. అయితే, తాము పదిమందితో సంస్మరణ స్థూపం వద్ద నివాళులు అర్పిస్తామని ఆదివాసీ సంఘం నేత పుర్క బాపూరావు ప్రకటించారు. మరోవైపు కరోనా ప్రభావం వల్ల కూడా సంస్మరణ సభ నిర్వహించేందుకు ఆటంకం ఏర్పడుతుందని, ఆదిమ గిరిజనులందరూ ఇంద్రవెల్లి అమరవీరులను ఇళ్లలోనే ఉండే స్మరించుకోవాలని ఆయన కోరారు.
tags: Indravelli, April 20, Police, Prohibitory orders