రక్తాన్ని చెమటగా మార్చి రాజ్యాంగ రచన.. ప్రొఫెసర్ కాశీం ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-09-12 08:53:37.0  )
Professor Kashim
X

దిశ, సంగారెడ్డి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన రక్తాన్ని చెమటగా మార్చి భారత రాజ్యాంగాన్ని రచించారని ప్రొఫెసర్ కాశీం అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో బంధు సొసైటీ ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం.. అంబేద్కర్, బహుజన సమాజం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు వక్తగా హాజరైన ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. అంబేద్కర్ 1919 నుండి 1947 వరకు స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూనే దళిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశాడని అన్నారు. తన మేధో సంపత్తితో అంటరానితనమే ఆస్తిగా బతుకుతున్న వారికి కొంత ఊరట కోసం విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు సాధించిపెట్టారన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపే మొగ్గు చూపడానికి బ్రిటిష్ వారితో కొట్లాడి ఓటు హక్కులు సాధించి పెట్టారన్నారు.

ఈ దేశానికి ఎన్నడో ఒకనాడు తన వాళ్లు పాలకులు అవుతారని హెచ్చరించారని, ఆధిపత్య కులాల వారి చేతుల్లో పార్టీలన్నీ నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అసెంబ్లీలో, పార్లమెంటులో అగ్రవర్ణాల కోసమే కొమ్ము కాస్తూ.. తమ వర్గాల వారిమీద ఎన్నో హత్యలు, దాడులు జరిపినా, నోరు మెదపడం లేదని ఆనాడే అంబేద్కర్ బాధ పడ్డారన్నారని గుర్తుచేశారు. గాంధీజీ చేసిన ద్రోహం వల్ల పూనా ఒప్పందం జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా అణగారిన కులాల భవిష్యత్తు అంధకారంగానే ఉండడం శోచనీయమని కాశీం తెలిపారు. ఐక్యం కావడం కంటే అవగాహనలో, అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ సమస్య ఉందన్నారు.

అనగారిన వర్గాలవారు అధికారంలోకి రావాలంటే ప్రతీ కార్యాలయంలో ప్రజల సమస్యల సాధనకు సలహాలు ఇచ్చి నడిపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల మధ్య ఐక్యత కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సెమినార్‌లో బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పి.వీరస్వామి, డాక్టర్ శ్రీనివాస్ హాజరాయ్, సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజు, మారుతి, సీహెచ్.రాములు, అశోక్ కుమార్, శంకర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బాల కిషన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పి.దుర్గయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎం.అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. మార్పు కళామండలి వ్యవస్థాపకులు ఎన్నార్ వందన సమర్పణతో సెమినార్ ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed