ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు

by Shyam |
ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు
X

దిశ, నల్లగొండ: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ త్వరగా ప్రకటించాలనో లేదా ఫలితాల ప్రకటనలో ఆలస్యమైతే ప్రభుత్వం పరువు పోతుందోనన్న ఉద్దేశమేమైనా ఉన్నదో తెలియదు కానీ, ఈసారి కూడా పేపర్స్ వాల్యుయేషన్ ఆదరబాదరాగానే సాగుతోంది. సెంటర్లలో టీచర్లకు కరోనా రక్షణా చర్యలు కనిపించకపోగా వారికి కనీస సౌకర్యాలైన ఫ్యాన్లు, కూలర్లూ లేవు. గతేడాది వాల్యుయేషన్‌లో లోపాల వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోగా, కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదంతా ఇంటర్ బోర్డు తప్పిదమేనన్నది బహిరంగ రహస్యం. ఈ ఘటన జరిగి ఏడాదికాకముందే దాన్ని బోర్డు మరిచిపోయినట్లుంది. దాన్నుంచి పాఠం నేర్వనట్లు కనిపిస్తోన్నది. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ మూల్యాంకన విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు ధర్నాకు దిగారంటే పరిస్థితి ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఈ సెంటర్లలో అధ్యాపకుల అవస్థలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

12 సెంటర్లలో వాల్యుయేషన్..

రాష్ర్ట వ్యాప్తంగా 12 సెంటర్లలో మూల్యాంకనం ప్రారంభమై 5 రోజులవుతోన్నది. వాస్తవానికి మూల్యాంకన విధులకు ఇప్పట్లో హాజరుకాబోమని టీచర్లు ముందుగానే చెప్పారు. కానీ, ఇంటర్ బోర్డు, ప్రభుత్వం కరోనా నుంచి రక్షణకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పింది. అందుకు సంబంధించి నిధులను బోర్డుకు రిలీజ్ చేస్తామని చెప్పింది. దాంతో అధ్యాపకులు వాల్యుయేషన్‌కు ముందుకొచ్చారు. అయితే, గతంలో రోజూ అధ్యాపకుడు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటే ప్రస్తుతం దాన్ని 45 పేపర్లకు పెంచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న విధులను 9 గంటల నుంచి 6 గంటల దాకా మార్చారు. దీంతో అధ్యాపకులపై మానసిక భారం పడుతోన్నది. జిల్లా కేంద్రాల్లోని సెంటర్లకు వెళ్లేందుకు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే కేంద్రాల వద్ద హాస్టల్ ఏర్పాటు చేస్తామన్న యంత్రాంగం.. ఇప్పుడామాట ఎత్తడం లేదని పలువురు టీచర్లు అంటున్నారు.

కనీస సౌకర్యాలు కల్పించాలని ధర్నా..

వాల్యుయేషన్ సెంటర్లలో కనీస వసతులు కరువయ్యాయి. ఎండాకాలం కాబట్టి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఓ సెంటర్ వద్ద టీచర్లు కనీస సౌకర్యాలు కల్పించాలని ధర్నా చేశారు. మూల్యాంకన కేంద్రాల్లో హైజినిక్ వాతావరణం కల్పిస్తామని మొదట్లో అధికార యంత్రాంగం చెప్పింది. కానీ, ఇప్పుడు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం మాస్కులు, చేతులకు శానిటైజర్లు ఇవ్వడం లేదు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడు చోట్ల మూల్యాంకనం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భౌతికదూరం పాటించేందుకు డాన్ బోస్కో, కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కాలేజీ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మూల్యాంకనం చేసేందుకు విధులకు హాజరవుతున్న టీచర్లకు కనీసం పెన్సిల్, పెన్నులు ఇవ్వడం లేదని తెలుస్తోన్నది. ప్రతి కేంద్రానికీ కరోనా వైరస్‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ చేయడంతోపాటు ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed