‘సద్ది’లో అది లేకపోతే నడ్వది..

by Shyam |   ( Updated:2020-05-01 23:51:54.0  )
‘సద్ది’లో అది లేకపోతే నడ్వది..
X

దిశ, నల్లగొండ:
కాలం ఏదైనా.. మామిడికాయ పచ్చడి అంటే రైతాంగానికి అమృతమే. ఉడుకు బువ్వల ఇంత మామిడి కాయ తొక్కు వేసుకుని తింటే అందులో ఉండే మజాయే వేరు. రోజూ రైతులు, కూలీలు తమ సద్దిలో మామిడికాయ పచ్చడి లేకుండా పొలం పనులకు వెళ్లరు. అది లేకపోతే అసలు మద్ద దిగనట్లు, పని జరగదన్నట్లు భావిస్తుంటారు. పొలంకాడ పొద్దంత కష్టపడి.. కాసింత పచ్చడి మెతుకులు తిని దాంతోనే రైతన్న ఆనందపడతాడు. మామిడికాయ పచ్చడికి.. రైతులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. యాల్లకు కూర వండినా వండకపోయినా.. చేతిలో పైసల్లేక కూర వండకపోయినా. బాయికాడ పొద్దు పొద్దుగాల పనికి పోయిన ఈ పచ్చడి మెతుకులు రైతాంగానికి ఆసరాగా నిలుస్తాయి. పట్టణ ప్రాంతాల్లోని వారు మామిడి కాయ పచ్చడి తిన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల వారి ముందు అది దిగదుడుపే. అయితే, ఈ ఏడాది రైతాంగానికి ఆఖరుకు పచ్చడి మెతుకులు దొరకని పరిస్థితి ఏర్పడింది. పచ్చడి మామిడి కాయల దిగుబడి తగ్గడంతో వాటికి అమాంతంగా ధరలు పెరిగాయి. ఏటా 200 కాయల పచ్చడి పెట్టే రైతులు సైతం 20 కాయలకే పరిమితం కావాల్సి వస్తోంది. పచ్చడి కాయలకు ధర బాగుంది.. రైతులకు మంచిదే కదా అనుకుంటే.. మీరు పొరపడినట్టే. ఎందుకంటే.. పచ్చడి మామిడి కాయల తోటలు సాగు చేసే రైతులు పెట్టిన పెట్టుబడి ముందు ఈ ధరలు ఏమాత్రం నిలవడం లేదు. దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.

ఒక్కో కాయ రూ.40 పైనే..

మామిడికాయ పెట్టేందుకు ఇదే మంచి సీజన్. చాలామంది కత్తెర మాసంలోనే పచ్చడి పెడుతుంటారు. ముఖ్యంగా గ్రామాల్లో పుల్ల మామిడికాయ పచ్చడి తప్పకుండా పెడతారు. కానీ, ఈ ఏడాది మామిడి తోటలు సరిగ్గా కాయకపోవడంతో పుల్ల మామిడి దొరకక ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రైతులు వర్షాకాలంలో తమ పశువులకూ మామిడికాయ పచ్చడిని తినిపిస్తారు. ఒక రైతు కుటుంబంలో సుమారు వంద మామిడి కాయలు కోసి ఏటా పచ్చడి పెట్టే వారు. కానీ, ఈ సీజన్‌లో 20 కాయలకే పరిమితమయ్యారు. గత సీజన్‌లో రూ.5కు ఒక కాయ చొప్పున దొరికిన పుల్ల మామిడి.. ఈ సీజన్‌లో రూ.40 పలుకుతోంది. జిల్లాలో పెద్దగా ఎక్కడ మామిడి తోటలు కాయకపోవడంతో పచ్చని మామిడికి గిరాకి బాగా పెరిగింది. గతంలో100 గ్రాములు ఉన్న మామిడికాయ 5 రూపాయలకు లభించగా, ఇప్పుడు అదే కాయ ధర 40 రూపాయలకు పెరగడంతో మామిడికాయ పచ్చడి పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీనికితోడు కాయలూ దొరకడం లేదు. ఈ పచ్చడికి సాధారణంగా వంటల్లో వేసే కారం వినియోగించరు. ప్రత్యేకంగా మిరపకాయలను కొని కారం కొట్టిస్తారు. కానీ, మిరపకాయలూ కిలో రూ.220కి పైగా ధర పలుకుతోంది. ఎటు చూసినా ఈసారి పచ్చడి మెతుకులకు సైతం దూరం కావాల్సి వస్తోంది.

తగ్గిన దిగుబడి..

వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి చెట్టు కాయలు ఈసారి పెద్దగా కాయలేదు. అక్కడక్కడ అడపాదడపా కాసినప్పటికి ఇటీవల వచ్చిన గాలి దుమారాలకు కొద్దిపాటి కాయలు రాలిపోవడం, మరికొన్ని కాయలు కోతులు తెంపి వేయడం రైతులకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది. కొంతమంది మామిడి రైతులు చెట్లకు కాతపూత సరిగా లేకపోవడంతో పెట్టుబడి దండుగనే ఉద్దేశంతో చెట్లను నరికి వేశారు. ఇది కూడా పచ్చడి కాయలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో బంగినపల్లి, తోతాపురి, హిమా పసంద్, పెద్ద రసాలు, చిన్న రసాలలాంటి తీయ మామిడితో పాటు, పచ్చడకు పనికి వచ్చే పుల్ల మామిడి తోటలకు ప్రసిద్ధి. అయినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల తీయ మామిడి, పుల్ల మామిడి కాయలు కాయలేదు. ఫలితంగా మామిడి తోటల రైతులూ భారీగానే నష్టపోతున్నారు.

ఏటా 100 కాయలతో పచ్చడి పెడ్తా..

ఏటా 100 కాయలతో మామిడికాయ పచ్చడి పెట్టేదాన్ని. ఈసారి కాయలు దొరకడం లేదు. అక్కడో ఇక్కడో దొరికినా ధర ఎక్కువగా ఉంది. దీంతో 20 కాయలతో సర్దుకోవాల్సి వచ్చింది. ఈ యేడు ఏం తిని బతకాల్నో అర్థం కావట్లే. అసలే పనుల్లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నాం. కనీసం పచ్చడి ప్రతి రైతు కుటుంబంలో ఏ కూర వండిన మామిడి కాయ పచ్చడిని అంచుకు పెట్టకోనిది ముద్ద దిగదు అంటారు. ఈసారి పరిస్థితేమో..గిట్ల ఉంది.

– ఎల్లబోయిన సుశీల, గృహిణి, తుంగతుర్తి

ప్రభుత్వమే ఆదుకోవాలి..

ఈ ఏడాది మామిడి తోట సరిగ్గా కాయలేదు. దాని కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. నాకు ఐదెకరాల మామిడి తోట ఉంది. తోట సాగు కోసం రూ.2 లక్షలు పెట్టుబడిపెట్టా. కానీ, తోట సరిగా కాయకపోవడంతో సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నాను. ఈ ఏడాది పెట్టుబడి కూడా మిగిలే పరిస్థితి లేదు. ఏం జేయాల్నో అర్థం కావట్లే. ప్రభుత్వమే ఆదుకోవాలి.

– పసుల అశోక్, మామిడి రైతు, ఎర్రపహాడ్

Tags: mango pickle, farmers, problems, high price, nalgonda, atmosphere effect

Advertisement

Next Story

Most Viewed