ఫీజులు కట్టాల్సిందే.. ప్రై‘వేటు’ ఒత్తిడి.. పట్టించుకోని సర్కార్

by Shyam |
ఫీజులు కట్టాల్సిందే.. ప్రై‘వేటు’ ఒత్తిడి.. పట్టించుకోని సర్కార్
X

దిశ ప్రతినిధి, మెదక్ : కరోనా కాటుకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యా సంస్థలు సైతం గత ఏడాదిన్నరగా మూసేసి ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పిల్లలెవరూ చదువుకు దూరం కావొద్దని భావించిన సర్కారు ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాయి.

అయితే, గత కొంత కాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పాఠశాల యాజమాన్యాల నుంచి పేరెంట్స్ సందేశాలు పంపించారు. కొంత మంది డైరెక్ట్‌గా కాల్ చేసి మొత్తం ఫీజు కడితేనే ఆన్‌లైన్ క్లాసులకు అనుమతిస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇంత అకస్మాత్తుగా ఫీజు ఎలా చెల్లించాలంటూ ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యక్ష తరగతులకు సన్నాహలు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 650 పైచిలుకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 293 ప్రైవేటు పాఠశాలలుండగా సంగారెడ్డి జిల్లాలో 295 ప్రైవేటు పాఠశాలలు, మెదక్ జిల్లాలో వంద వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్టు సమాచారం. ఈ పాఠశాలలో 1-10 తరగతులు కలిపి లక్ష వరకు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో మార్చి ఒకటో తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించారు.

అయితే, ప్రత్యక్ష బోధన ప్రారంభించిన పదిహేను రోజులకే కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రత్యక్ష బోధన నిలిపివేశారు. అప్పటి నుంచి తిరిగి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. తిరిగి కరోనా కేసులు తగ్గడంతో సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సైతం ప్రత్యక్ష బోధన ప్రారంభానికి కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఫీజులు కట్టాల్సిందే..

జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు ఏర్పాట్లు చేస్తుండటంతో ఆ లోగా ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి పూర్తి ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి పూర్తి ఫీజు చెల్లించాలని ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు పంపడంతో పాటు ప్రత్యేకంగా ఫోన్‌ కాల్స్ చేస్తున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇస్తామని తెగేసి చెబుతున్నాయి.

ఫీజు కట్టాలంటూ టీచర్లు చెబుతుండటంతో విద్యార్ధుల పేరెంట్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రత్యక్ష తరగతుల కంటే ఆన్‌లైన్ క్లాసుల ఫీజు రెట్టింపు ఉండటంతో ఎలా కట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story