ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాల రూ. 53 కోట్లు

by Anukaran |   ( Updated:2020-11-28 06:10:10.0  )
ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాల రూ. 53 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫ్రెండ్‌‌షిప్, రోడ్ ట్రిప్స్, మనిషిలోని భయాలను జయించడం వంటి అంశాల కలయికగా బాలీవుడ్‌లో 2011లో వచ్చిన చిత్రం ‘జిందగీ న మిలేగీ దొబారా’. చాలామంది మోస్ట్ ఫేవరెట్ సినిమాల లిస్టులో ఇది కూడా ఉంటుంది. ఈ సినిమాలోని ఒక ఐకానిక్ క్యారెక్టర్ పేరు ‘బ్యాగ్‌వతి’. ఆ బ్యాగ్‌ను హృతిక్ రోషన్ కొని, తన ఫ్రెండ్‌కు బహుమతిగా ఇస్తాడు. దాని విలువ 12 వేల యూరోలు (రూ. 10, 61,663) అని చెబితే తన ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. అయితే ఇప్పుడు దాన్ని మించిన రియల్ బ్యాగ్‌వతిని ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ‘బొరిని మిలానెసి’ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. దాని విలువ అక్షరాల రూ. 53 కోట్లు. ఈ విషయాన్ని ఆ కంపెనీ తన అధికారిక ఇన్‌‌స్టా‌లో షేర్ చేసింది.

ప్రపంచంలోనే అతి ఖరీదైన బ్యాగ్‌‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ బ్యాగ్‌ను సెమీ-షైనీ ఎలిగేటర్ స్కిన్‌తో తయారుచేశారు. పది వైట్ గోల్డ్ బటర్‌ఫ్లైస్‌తో డిజైన్ చేశారు. అంతేకాదు డైమండ్స్, అరుదైన జెమ్స్‌ను ఈ బ్యాగు కోసం ఉపయోగించారు. దీని ఖరీదు 6 మిలియన్ల యూరోలు (రూ. 53 కోట్లు). అయితే ఇంత ఖరీదైన బ్యాగ్ తయారీ వెనక అద్భుతమైన లక్ష్యం దాగి ఉందని తయారీదారులు చెబుతున్నారు. అదేంటంటే.. భూమి మీదనే కాదు, సముద్రాల్లోనూ రోజురోజుకీ ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతుందని తెలిసిందే.

ఆ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎన్నో సముద్ర జీవులు తమ మనుగడ కోల్పోతుండగా, మరెన్నో జీవులు ప్రాణాలు విడుస్తున్నాయి. అందుకే సముద్ర గర్భంలో పేరుకుపోతున్న చెత్తను, సముద్రాలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు ఈ బ్యాగు అమ్మగా వచ్చిన మొత్తం నుంచి 8 లక్షల యూరోలను కేటాయించనున్నారు. అంతేకాకుండా సముద్రాలు కలుషితమవకుండా కాపాడుకునేందుకు అందరూ బాధ్యత వహించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

అయితే సముద్రాలు క్లీన్ చేయడానికి, ప్రజలకు సముద్రాల ఆవశ్యకతను పెంపొందించడానికే ఈ బ్యాగును రూపొందించామని తయారీదారులు చెబుతుంటే నవ్వొస్తుందని, సముద్ర జీవులను కాపాడుతామంటూ మొసలి స్కిన్‌ను బ్యాగు తయారీకి ఉపయోగించడం ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘ఆలోచన మంచిదే కానీ, ఇలా కాకుండా మరో తీరుగా ఆలోచించి సముద్రాలను కాపాడండి, ముందు మీరు బ్యాగుల తయారీకి జంతువుల చర్మం ఉపయోగించకుండా, వాటిని బతకనివ్వండి, ఆ తర్వాత అవగాహన కల్పించండి’ అని కామెంట్లు చేస్తున్నారు.

నిజమే మరి.. చెప్పేదొకటి, చేసేదొకటైతే ఇలానే ఉంటుంది. అందుకే ఒకరికి చెప్పే ముందు, మనం దాన్ని ఆచరించి చూపితే, నలుగురు ఆ బాటలో నడుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed