నేను పోతనమ్మో…. సర్కారు దవాఖానకే….

by Anukaran |
నేను పోతనమ్మో…. సర్కారు దవాఖానకే….
X

దిశ, జవహార్‌నగర్: వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అంతే సంగతులు.. ఇది ఒకప్పటి మాట. నేను పోతనమ్మో… సర్కారు దవాఖానాకే ఇది నేటి మాట. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తోంది. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించి పురుడు పోసి కేసీఆర్‌ కిట్‌తో క్షేమంగా ఇళ్లకు పంపుతోంది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ)లో కొవిడ్‌ సమయంలోనూ భయపడుకుండా వైద్యులు ప్రసవాలు చేస్తున్నారు. గత ఐదు నెలల కాలంలో జవహర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 53 సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీలు) నిర్వహించారు.

మాతాశిశు సంరక్షణకు పెద్దపీట ..

రాష్ట్రం ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడం, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. అంబులెన్స్ ద్వారా వైద్య పరీక్షలు, ప్రసవం తర్వాత క్షేమంగా ఇళ్లకు చేరుస్తుండడంతో గర్భిణులు ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానా దారిపట్టారు. జవహర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు వివిధ పరీక్షలు చేసి అవసరమైన మందులు అందిస్తున్నారు. ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు అంగన్‌వాడీ సిబ్బంది మధ్యాహ్నం పౌష్టికాహారం ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం కింద దశలవారీగా మగ పిల్లాడు జన్మిస్తే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రసవానంతరం ఇళ్లకు వెళ్లే సమయంలో రూ.2వేల విలువ కలిగిన 15 వస్తువులతో కిట్‌ను అందిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలోనూ వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పని చేయడంతో ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది.

ప్రజల్లో నమ్మకం పెరిగింది..

గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి ప్రసవాలు పెరిగాయి. కేసీఆర్‌ కిట్‌ కూడా మంచి ఫలితాలు ఇస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. కోవిడ్ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన సలహాలు సూచనలు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. శిశు మరణాల రేటు బాగా తగ్గింది. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. – డాక్టర్ పద్మావతి, వైద్యాధికారిణి

Advertisement

Next Story

Most Viewed