KTR: కేటీఆర్ కు నోటీసులకు ఈడీ రంగం సిద్ధం?

by Prasad Jukanti |
KTR: కేటీఆర్ కు నోటీసులకు ఈడీ రంగం సిద్ధం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ లో ఫార్ములా -ఈ కార్ రేస్ (Formula- E car race case వివాదం చలికాలంలోను రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు ఉచ్చు బిగుస్తోంది. ఏసీబీ కేసులో అరెస్టు నుంచి 10 రోజుల పాటు తప్పించుకోగలిగిన కేటీఆర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఫార్ములా -ఈ కార్ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్, ఫెమా రూల్స్ ఉల్లంఘించారంటూ తాజాగా ఈడీ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సీఈ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో త్వరలోనే కేటీఆర్ తో సహా మిగతా ఇద్దరికి ఈడీ నోటీసులు (ED notices) ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సోమవారం లేదా ఆ తర్వాత నిందితులకు నోటీసులు ఇచ్చి వారి స్టేట్ మెంట్ రికార్డు చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. వారిచ్చే స్టేట్ మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫార్ములా రేస్ వ్యవహరంలో ఈడీ ఎంట్రీతో వాట్ నెక్స్ట్ అనేది బీఆర్ఎస్ లో ఉత్కంఠగా మారింది.

న్యాయనిపుణులతో సంప్రదింపులు!:

ఏసీబీ నమోదు చేసిన కేసులో తాత్కాలికంగానైనా ఊరట లభించింది అనుకునేలోపే ఈడీ కేసు నమోదు చేయడంతో తర్వాతి పరిణామాలపై బీఆర్ఎస్ (BRS) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈడీ కేసులోనూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ మేరకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదో కేసులో అరెస్టు అవుతారా లేక అరెస్టు నుంచి కేటీఆర్ తప్పించుకుంటారా అనేది ఇటు సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story