Robin Uthappa : భారత మాజీ క్రికెటర్ ఉతప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ

by Y. Venkata Narasimha Reddy |
Robin Uthappa : భారత మాజీ క్రికెటర్ ఉతప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రావిడెంట్ ఫండ్‌(PF) మోసం ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa)పై అరెస్ట్ వారెంట్(Arrest Warrant)జారీ అయింది. సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ దుస్తుల కంపెనీలో ప‌నిచేస్తున్న చాలా మందికి పీఎఫ్ చెల్లించ‌కుండా మోసానికి పాల్పడిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి వారెంట్ జారీ చేయ‌డంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని పులకేశినగర్ పోలీసులను ఆదేశించారు. బెంగుళూరులోని సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ డైరక్టర్ గా ఉత‌ప్ప వ్యవహరిస్తున్నాడు.

ఉద్యోగుల జీతాల్లోంచి 23ల‌క్షల 36 వేల 620 రూపాయ‌లు పీఎఫ్ క‌ట్ చేసినా వాటిని ఉద్యోగుల ఖాతాలో జ‌మ చేయ‌లేద‌ని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి దీనిపై పోలీసుల‌కు డిసెంబ‌ర్ 4న లేఖ రాశారు. నోటీసులు జారీ చేసేందుకు ఉత‌ప్ప నివాసానికి పోలీసులు వెళ్లగా ప్రస్తుతం అత‌డు ఆ చిరునామాలో ఉండ‌డం లేద‌ని తెలిసింది. దీంతో ఉత‌ప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 27లోపు పిఎఫ్ బకాయిలు చెల్లించాలని, లేకపోతే అరెస్టు తప్పదని పోలీసులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం ఉతప్ప కుటుంబం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. రాబిన్ ఉత‌ప్ప 2006 నుంచి 2015 వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న కెరీర్‌లో 46 వ‌న్డేలు, 13 టీ20ల్లో భార‌త జ‌ట్టుకు ఆడాడు.. 46 వ‌న్డేల్లో 25.9 స‌గ‌టుతో 934 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 అర్థశ‌త‌కాలు ఉన్నాయి. 13 టీ20ల్లో 24.9 స‌గ‌టుతో 249 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ అర్థశ‌త‌కం ఉంది. ఇక ఐపీఎల్ విష‌యానికి వ‌స్తే.. 2008 నుంచి 2022 వ‌ర‌కు ఆడాడు. 205 ఐపీఎల్ మ్యాచుల్లో 27.5 స‌గ‌టుతో 4952 ప‌రుగులు చేశాడు. ఇందులో 27 అర్థశ‌త‌కాలు ఉన్నాయి.

Advertisement

Next Story