రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి : కామారెడ్డి కలెక్టర్

by Aamani |
రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి : కామారెడ్డి కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : ముఖ్యమంత్రి కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్ , ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం కప్ 2024 సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10 నుండి 12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయిల్లో, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిల్లో క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. 8000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయిల్లో 13 ఈవెంట్లలో పాల్గొన్నారని, ఒక వేయి మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ ఈవెంట్లలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... క్రమశిక్షణ, అంకిత భావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని తెలిపారు. ఓడిన వారు కుంగిపోకుండా మరోసారి క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు. కష్టపడి చదవాలని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని అన్నారు. మత్తు పానీయాలకు, డ్రగ్స్ బారిన పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, అథ్లెటిక్ జనరల్ సెక్రటరీ హరిలాల్, పలు పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, పి.ఈ.టీ.లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం...

రక్త దానంతో మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం లో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రక్తదానం తో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరు మాసాలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని నిలువ చేయడం జరుగుతుందని, అత్యవసర సమయంలో వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. సుమారు 60 యూనిట్ల రక్తం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, టీఎన్జీవో అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పలు శాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed