- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరపైకి పీఆర్సీ అంశం.. ఈ నెలలోనే నివేదిక?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో పీఆర్సీ నివేదిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ఎన్నికల్లో ఉద్యోగవర్గాల వ్యతిరేకత తేటతెల్లమైంది. దీంతో నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ నెలలోనే పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నివేదిక అందిన రోజే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశమై చర్చించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. దీంతో పీఆర్సీ కమిటీ ఇప్పటికే తయారు చేసుకున్న నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వచ్చే ఏడాది ఏప్రిల్‌నుంచి కొత్త వేతనాలు ఇచ్చేలా దీనికి తుదిరూపం ఇస్తున్నారు. దీంతో ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2015లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 43 శాతం ఫిట్‌మెంట్ అమలు చేశాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెంటనే ఏపీ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించి అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
ఆర్థిక పరిస్థితితో అంచనా వేస్తూ..
పీఆర్సీ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని స్వయంగా సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి తీసుకు రానున్నారు. ప్రస్తుత నివేదిక ప్రకారం నిధుల కొరత కారణంగా ఫిట్‌మెంట్ 30 శాతం ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీనితో మార్చి నుంచి ఇచ్చే విధంగా లెక్కలేసినా సుమారు రూ.1200 కోట్లు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనా నివేదికలను కూడా ప్రభుత్వానికి అందించనున్నారు.
ఈ నెలలో నివేదిక మాత్రమే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ) నివేదికను ఈ నెలలో సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2018 జూలై నుంచే పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం అప్పుడే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మూడుసార్లు గడువు పొడిగించింది. ఉద్యోగులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం 2018 మేలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా ఉమామాహేశ్వరావు, మహ్మద్ ఆలీ రఫీ సభ్యులుగా ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు పీఆర్సీ కమిటీని కలిసి వినతిపత్రాలు అందించాయి. ఆ తర్వాత కమిటీ అన్ని వర్గాల ఉద్యోగులను, అన్ని సంఘాల నేతలను కలిసి అభిప్రాయాలు సేకరించింది. అయితే కమిటీ ఏర్పాటైన మూడు నెలలకే అసెంబ్లీ రద్దుకావడం, అప్పటి నుంచి 2019 మే చివరి వరకూ వరుస ఎలక్షన్లతో పీఆర్సీ అంశం మరుగునపడింది. దీంతో గతేడాది జూన్ నుంచి మళ్లీ పీఆర్సీ అంశంపై దృష్టిపడింది. సర్కారు పీఆర్సీ కమిటీకి ఏ మాత్రం సంబంధంలేని ఒక పని అప్పగించింది. అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు తేల్చాలని ఆదేశించింది. దానిపై ఎంప్లాయీస్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ వినతిపత్రాలు ఇచ్చింది. కానీ పరిస్థితి మాత్రం మారలేదు. ఆ తర్వాత పీఆర్సీ గడువును ఈ ఏడాది డిసెంబర్వరకు పెంచారు.
ప్రస్తుతానిదే.. ఫస్టు కానుంది..
ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించే పీఆర్సీ రాష్ట్రంలో మొదటిది కానుంది. 2013కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అందాల్సిన పీఆర్సీని రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇచ్చారు. 2015 ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్ 43 శాతం ఫిట్మెంట్ప్రకటించారు. కానీ అప్పటికే ఉద్యోగులు 11 నెలల కాలాన్ని కొల్పోయారు. ఆ తర్వాతి పీఆర్సీ 2018 జులై 1 నుంచే అమలు కావాల్సి ఉంది. 2018లోనే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకల్లో పీఆర్సీ అంశాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పీఆర్సీ నివేదికలను వేగంగా చేసేందుకే ముగ్గురితో కమిటీ వేసినట్లు ప్రకటించారు. కానీ తీవ్రంగా జాప్యం జరిగింది. వరుసగా ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ఐఆర్అయినా ప్రకటించాలని ఉద్యోగులు కోరారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పీఆర్సీ, ఐఆర్, రిటైర్‌మెంట్ వయసు పెంపు అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ మూడింటిని ఒకేసారి ప్యాకేజ్ రూపంలో ఉద్యోగులకు అందిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. 2018 డిసెంబర్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్యోగ వర్గాల పరిస్థితి మరింత మారింది. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదు. కానీ ఆర్టీసీ సమ్మె మొదలయ్యాక అకస్మాత్తుగా ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి మాట్లాడారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ముగియగానే మరోసారి కలుద్దామని, పీఆర్సీ, ఐఆర్‌పై చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసి వచ్చినా వీటిపై సమావేశం మాత్రం కాలేదు.
ఆమోదయోగ్యంగా వస్తుందని ఆశిస్తున్నాం
పీఆర్సీ నివేదిక ఉద్యోగవర్గాలకు అనుకూలంగా వస్తుందనే ఆశతో ఉన్నాం. సీఎం కేసీఆర్ కూడా మాకు హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకనుగుణంగా పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది. త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తారని భావిస్తున్నాం.
– మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు