బంగారం కొనుగోలుకు హవాలా మనీ

by John Kora |
బంగారం కొనుగోలుకు హవాలా మనీ
X

- రెండేళ్లలో 52 సార్లు దుబాయ్ ప్రయాణం

- అనుమానాస్పద ప్రయాణ చరిత్ర

- నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటి, ఐపీఎస్ అధికారి కుమార్తె రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అనేక విషయాలను స్మగ్లింగ్ నిరోధక సంస్థ డీఆర్ఐ కోర్టుకు వివరించింది. మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో రన్యారావును డీఆర్ఐ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో రన్యారావు నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఆమె నివాసంలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల భారతీయ కరెన్సీని కనుగొన్నారు. అప్పటి నుంచి జైలులో ఉన్న రన్యారావు.. తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా డీఆర్ఐ తరపు న్యాయవాది పలు విషయాలు కోర్టు దృష్టికి తెచ్చారు. రన్యారావు 14.8 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయడానికి హవాలా ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించినట్లు విచారణలో అంగీకరించారని చెప్పారు. న్యాయ విచారణ ప్రారంభించడానికి ముందు సెక్షన్ 108 కింద జారీ చేశారని, ఆర్థిక అవకతవకల పరిధిని, చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉన్న వాటిని గుర్తించడమే ఈ దర్యాప్తు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

నటి రన్యారావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కి 26 ట్రిప్పలు వేశారని.. ఉదయం బయలుదేరితే సాయంత్రంకల్లా తిరిగి వచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ పేర్కొంది. తరుణ్.. రన్యారావుకు స్నేహితుడే కాకుండా బంగారం అక్రమ రవాణా కేసులో నిందితుడని చెప్పింది. తరుణ్ ఖాతాకు డబ్బులు పంపి రన్యారావు టికెట్ బుక్ చేసుకున్నారని.. ఆ తర్వాత తరుణ్ నేరుగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని అధికారులు తెలిపారు. తరచుగా ఒకే రోజు తిరుగు ప్రయాణాలు కూడా చేసి బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తెచ్చారని డీఆర్ఐ తెలిపింది. 2023 నుంచి 2025 మధ్య 52 ప్రయాణాలు చేశారని.. అందులో 45 ప్రయాణాలు ఒకే రోజు రౌండ్ ట్రిప్‌లు ఉన్నాయని చెప్పారు. రన్యారావు ఈ ఏడాది జనవరిలో బెంగళూరు, గోవా, ముంబై మీదుగా దుబాయ్ వెళ్లారని డీఆర్ఐ వెల్లడించింది.

కాగా, రన్యారావు వేసుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పటికే రెండు సార్లు తిరస్కరణకు గురైంది. దిగువ కోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు కూడా ఆమెకు బెయిల్ ఇవ్వలేదు. కాగా, రన్యారావు ఆర్థిక నేరాల నేపథ్యంలో ఆమె సవతి తండ్రి, ఐపీఎఎస్ అధికారి రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సెలవుపై పంపింది.

Next Story