- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేవా సంకల్పం ముందు ఓడిన వైకల్యం.. యువకుడిపై ప్రశంసలు
దిశ, సిద్దిపేట: కరోనా అంటేనే భయపడే రోజులివి. అలాంటిది తాను అంగవైకల్యంతో బాధపడుతున్న విషయాన్ని కూడా పక్కన పెట్టి తన వంతు కోవిడ్ బాధితులకు సాయం చేయాలని సంకల్పించాడు. అతని సేవా సంకల్పం ముందు అంగవైకల్యం ఓడింది. వైకల్యం శరీరానికే కాని తన మనసుకు కాదని నిరూపిస్తున్నాడు సిద్దిపేటకు చెందిన బింగి సాయికుమార్. కరోనా బాధితులకు అండగా చాలా స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చాయి. అందులో ఒకటి నారీ సేవా స్వచ్చంద సంస్థ. ఆ సంస్థలో సభ్యునిగా చేరిన సాయికుమార్ కోవిడ్ బారిన పడిన వివరాలు తెలుసుకొని వారి ఇంటికెళ్లి భోజనం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
నారీ సేవా సంస్థ చేయూత
నారీ సేవా స్వచ్చంద సంస్థ దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుండగా.. చాలా కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారి కోసం భోజనం అందించాలని సంకల్పించింది. ఈ క్రమంలో సిద్దిపేట ప్రాంతంలోనూ నారీ సేవా స్వచ్చంద సంస్థ తన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని భావించింది. ఇందుకోసం ఆ సంస్థ వ్యవస్థాపకురాలు లతా చౌదరి సిద్దిపేట మున్సిపల్ 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజుకు బాధ్యతలు అప్పగించారు. కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కోవిడ్ బాధితులకు ఆహారం అందజేసే కార్యక్రమం కొనసాగుతుంది.
సంస్థలో సభ్యుడిగా సాయికుమార్
కోవిడ్ బారిన పడిన వారికి భోజన సాయం అందిస్తున్న నారీ సేవా స్వచ్చంద సంస్థలో సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన బింగి సాయి కుమార్ సభ్యుడిగా చేరాడు. అతను డిగ్రీ చదువుతుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం వల్ల డిగ్రీ పరీక్షలు కూడా రాయలేకపోయాడు. కొంతకాలం చక్రాల కుర్చీకే పరిమితమైన స్థితిలో ఉన్న సాయి కుమార్.. ఇక లాభం లేదనుకుని సమయం వృధా చేయొద్దని ఆత్మవిశ్వాసంతో మీ-సేవ కేంద్రాన్ని లీజుకు తీసుకుని నడిపించాడు. మీసేవ ద్వారా సమాజానికి సేవలందిస్తూ ఉపాధి పొందుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేశాయి. ఆ సమయంలో తాను ఇంట్లో ఉండి లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ వస్తున్నాడు. ఇటీవల కరోనా బారిన పడ్డ వారికి నారి సేవా సంస్థ భోజనాన్ని అందిస్తుందని తెలుసుకున్నాడు. ఎలాగైనా ఈ సంస్ధ ద్వారా తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ సంస్థలో వాలంటీర్‌గా చేరి సిద్దిపేట పట్టణానికి చెందిన వివిధ వార్డులలో కరోనా మహమ్మారి బారిన పడిన పాజిటివ్ పేషెంట్లకు, వారి కుటుంబ సభ్యులకు ఆహార పొట్లాలను అందించే బాధ్యతను చేపట్టాడు. సిద్దిపేట పట్టణంలో ఎవరెవరు కోవిడ్ బారిన పడ్డారు?. వారి ఆర్థిక స్థితిగతులేమిటి? అనే విషయాలను వాట్సాప్, ఫేసుబుక్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ వారి ఇంటి వద్దకు వెళ్లి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో వారికి ఆహారం అందిస్తూ కోవిడ్ బారిన పడిన వారికి సాయం చేస్తున్నాడు. 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు చేస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో తన వంతు బాధ్యతగా తన అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా ఒక వాలంటీర్ గా ముందుకు వచ్చి సాయం చేయడంపై సిద్దిపేట పట్టణ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.