RSS: ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
RSS: ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మందిరాలు- మసీదుల వివాదాలపై రాష్ట్రీయ స్వయంసేవక్(RSS) అధినేత మోహన్‌ భగవత్‌ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. పుణెలో ‘ఇండియా-ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు. ఇది జరగవద్దు. సామరస్యంగా ఎలా ఉంటామో భారత్‌ ప్రపంచానికి చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన దేవుడ్ని పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం’’ అని భగవత్ ప్రసంగంలో పేర్కొన్నారు.

అయోధ్య నిర్మాణం తర్వాత..

అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను సృష్టించి తాము కూడా హిందూ నాయకులం కావాలని కొందరు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చారు. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్‌ పిలుపునిచ్చారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్‌ వేడుకలు చేసుకొంటామని పేర్కొన్నారు. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నామని.. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలన్నారు.

Advertisement

Next Story