ఆ బస్టాండ్ పరిస్థితి పైన పటారం.. లోన లొటారం..

by Shyam |
ఆ బస్టాండ్ పరిస్థితి పైన  పటారం.. లోన లొటారం..
X

దిశ‌,ఖ‌మ్మం : పైన పటారం.. లోన లొటారం.. అన్న చందంగా మారింది ఖమ్మం నూత‌న బ‌స్టాండ్ నిర్మాణ ప‌నులు బ‌స్టాండ్ పై క‌ప్పు వేసిన రేకులు అందంగా క‌నిపిస్తున్నా లోప‌ల మాత్రం నాణ్యత లేక డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నా.. నాసిరకం పనులతో నిధులు రాళ్లలో పోసినట్లవుతోంది. ఓ వైపు నిర్మాణం సాగుతున్నా ఇప్పటికే నిర్మించిన చోట కొద్దిరోజులకే పనుల్లో నాణ్యతా లోపాలు బయట పడుతున్నాయి. ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో నూత‌నంగా నిర్మిస్తున్న బ‌స్టాండ్ పనుల్లో జరుగుతున్న నాసిరకం పనులపై దిశ ప్రత్యేక కథనం… ఖ‌మ్మం న‌గ‌రం న‌డిబొడ్డున ఆర్టీసీ బ‌స్టాండ్ ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో స‌రిపోక‌పోవ‌డంతో తెలంగాణ ప్రభుత్వం బైపాస్ రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్పీ స్థలంలో 7.29 ఎక‌రాల‌ను కేటాయించింది. ప్రజ‌ల‌కు ఆధునిక హంగుల‌తో నిర్మాణం చేప‌ట్టాల‌ని రూ. 25 కోట్ల నిధుల‌తో 30 ప్లాట్‌ఫామ్స్ నిర్మాణం చేయాల‌ని ప్రభుత్వం ఆలోచ‌న.

ఈ నిర్మాణ ప‌నుల‌కు అప్పటి మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రి త‌ుమ్మల నాగేశ్వర‌రావు, ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌కుమార్‌తో క‌ల‌సి , ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాప‌న చేయించారు. అప్పుడు వెంట‌నే నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మైనా ప్రభుత్వం నుంచి అనుకున్న స‌మ‌యంలో నిధులు రాక‌పోవ‌డంతో కాంట్రాక్టర్ ప‌నులు చేయ‌డంలో జాప్యం చేశారు. దీంతో చాలా కాలం పాటు ప‌నులు నిలిచిపోయాయి. జిల్లా జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల త‌ర్వాత పువ్వాడ అజ‌య్‌కుమార్ రవాణా శాఖ మంత్రి గా బాధ్యత‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌నులను ప్రారంభించారు. కానీ ముందుగా కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న కాంట్రాక్టర్ ప‌నులు చేయ‌డంలో ఆల‌స‌త్వం వ‌హించ‌డంలో కాంట్రాక్టర్‌ను ర‌ద్దు చేశారు. ఖ‌మ్మం న‌గ‌రంలో కొంత మందికి మంత్రి బ‌స్టాండ్ నిర్మాణ ప‌నులు బాధ్యత‌లు ఇవ్వటంతో ప‌నుల్లో నాణ్యత లోపించింద‌ని ప్రజ‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

పైన సుందరం.. లోపల నాణ్యతాలోపం

నూత‌న బ‌స్టాండ్ నిర్మాణ ప‌నుల‌కు మంత్రి స్ధానికంగా ఉండే కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో పైన సుంద‌రం.. లోప‌ల లొటారం అనే వ్యవ‌హారం న‌డుసస్తుంది. బ‌స్టాండ్ లోప‌ల ప్లోరింగ్‌, ప్లాట్ ఫామ్స్ నిర్మాణ ప‌నుల్లో నాణ్యత లోపించిన‌ట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిర్మాణంలో భాగంగా సిమెంటుకు బదులు కంకర డస్ట్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో నాసిరకం నిర్మాణంతో నిధులు వృథా అవుతున్నాయని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు బ‌స్టాండ్ లోప‌ల నిర్మాణం చేప‌ట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో కూడా డొల్లతనం క‌నిపిస్తుంది. బ‌స్టాండ్‌లోప‌ల ప్రవేశించే స‌మ‌యంలో ఎత్తుగా ర్యాంపులా ఉంటే బ‌స్సులు ఏవిధంగా వెళ్తాయ‌ని ఆర్టీసీ కార్మికులు తెలుపుతున్నారు. లోప‌ల జ‌రుగుతున్న మ‌ర‌గుదొడ్డు నిర్మాణం, లైటింగ్ వ్యవ‌స్థ కూడా పూర్తి స్థాయిలో స‌రిగా చేయ‌లేద‌ని అక్కడ ప‌నిచేస్తున్న కార్మికులే చెప్పడం విడ్డూరం ఉంది. పనుల్లో నాణ్యత పాటిస్తూ బ‌స్టాండ్ ర్లు నిర్మించాలని నగర వాసులు కోరుతున్నారు. అలాగే నిర్వహణ చేపట్టి ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మూణ్నాళ్ల ముచ్చట చందంగా అవుతుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed