గవర్నమెంట్‌ స్కూల్స్‌పై పట్టింపులేదా.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

by Shyam |   ( Updated:2021-11-12 07:24:01.0  )
గవర్నమెంట్‌ స్కూల్స్‌పై పట్టింపులేదా.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?
X

దిశ, మన్సూరాబాద్: ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులను బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నాయి తప్పా.. క్షేత్రస్థాయిలో చూస్తే ఆచరణలో కనిపించడం లేదు. అందుకు సరూర్‌‌నగర్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలే నిదర్శనంగా చెప్పవచ్చు. అరకొర వసతులు, ఉపాధ్యాయుల కొరత, గదుల కొరత, స్వీపర్స్ కొరత, టాయిలెట్స్‌ని శుభ్రం చేసే సిబ్బంది లేక తదితర సమస్యలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి.

ఒకే గదిలో రెండు తరగతులు..

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మండల పరిషత్ పాఠశాలలో.. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. హైస్కూల్‌లో దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే 6-7వ తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఇక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 200 పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ.. సరిపడ బెంచీలు లేక నేలపైనే కూర్చొని పాఠాలను వింటున్నారు. చివరకు పాఠశాల సిబ్బందికి అందుబాటులో ఉండాల్సిన ఫర్నీచర్ లేక ఇబ్బంది పడుతున్నారు.

మౌలిక వసతులు నిల్.. మందు బాబుల హల్‌చల్..

కనీసం పాఠశాలలో తాగడానికి మంచినీళ్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. చివరకు ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మౌలిక వసతుల సంగతి పక్కనబెడితే సెక్యూరిటీ విషయానికొస్తే భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. తాగుబోతులకు అడ్డాగా పాఠశాల ఆవరణ మారింది. చీకటి పడితే చాలు తాగుబోతులు గేటు దూకి యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు. ఖాళీ సీసాలను పగులగొట్టి వీరంగం సృష్టిస్తున్నారు. మందు ఎక్కువైతే ఉదయం వరకు అక్కడే నిద్రపోవడం గమనార్హం.

పట్టించుకునే నాథుడే కరువు..

ఇక పాఠశాల భవనం దుస్థితి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉపాధ్యాయులు చాలాసార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదు. జిల్లా కేంద్రాలకు వెళ్లి, అధికారులకు వినతులు ఇచ్చినా ఎవరు పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed