కరోనాతో పేదలు అతలాకుతలమయ్యారు: ప్రధాని

by Shamantha N |
కరోనాతో పేదలు అతలాకుతలమయ్యారు: ప్రధాని
X

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడిందని, ముఖ్యంగా పేదలను అతలాకుతలం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ మహమ్మారి కారణంగా పేదలు అనుభవించిన బాధలు వర్ణనాతీతమని అన్నారు. నెలకోసారి నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్ 5.0లో భాగంగా చాలా వరకు ఆర్థిక సేవలు ప్రారంభమవుతాయని, కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని సూచించారు. సామాజిక దూరాన్ని పాటించాలని, వీలైతే ఇంటికే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. కరోనా పోరాటం సుదీర్ఘంగా జరుగుతుందని అన్నారు. కొన్ని దేశాలతో పోల్చి చూస్తే భారతీయులు ఎంతో పరిణతితో ఈ మహమ్మారిని ఎదుర్కొంటున్నారని, తత్ఫలితంగానే మనదేశంలో కరోనా మరణాల రేటు స్వల్పంగా ఉన్నదని, వైరస్ వ్యాప్తి కూడా నెమ్మదిగా ఉన్నదని తెలిపారు. ఇక్కడ కరోనా పోరు ప్రజా క్షేత్రంలో జరుగుతున్నదని, ప్రజల నేతృత్వంలోనే సాగుతున్నదని చెప్పారు. వలస కూలీలను తరలిస్తున్న రైల్వే అధికారులను ప్రత్యేకంగా గుర్తుచేశారు. రేయింబవళ్లు పనిలో నిమగ్నమవుతున్న రైల్వే సిబ్బందిని ప్రశంసిస్తూ వీరినీ కరోనా యోధులుగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభ కాలంలో ప్రతిఒక్కరూ తమ సేవానిరతిని ప్రదర్శించారని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు మాస్కులు కుట్టడం, ఆన్‌లైన్ పాఠాల కోసం మరికొందరు నూతన ఆవిష్కరణలు చేయడంలాంటి ఎన్నో ఉపకారయుక్తమైన కార్యాలు జరిగాయని వివరించారు. కరోనా వైరస్ ముఖ్యంగా మన శ్వాసవ్యవస్థను దెబ్బతీస్తుందని, దీనికి విరుగుడుగా యోగా పని చేస్తుందని చెప్పారు. ఇప్పుడు హాలీవుడ్ నుంచి హరిద్వార్ దాకా యోగాపై ఆసక్తి చూపుతున్నారని, యోగాతో ప్రజలు శక్తివంతం కావాలని సూచించారు. ఈ సంక్షోభ కాలంలోనే అంఫాన్ తుఫాన్ విరుచుకుపడిందని గుర్తుచేశారు. ఒడిషా, బెంగాల్ ప్రజలు ఈ తుఫాన్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ ధైర్యాన్ని ప్రదర్శించారని చెప్పారు. ఎడారి మిడతలు పంటలను నాశనం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మిడతల దండుతో నష్టపోయిన రాష్ట్రాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed