గరీబొళ్లకు ఊరట..

by Shyam |
గరీబొళ్లకు ఊరట..
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి వర్గాలను ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీఏవై) కింద లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ పథకంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 30లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

జిల్లాలో ఇళ్లకే పరమితమైన వారు 40 లక్షలు..

లాక్ డౌన్ కారణంగా జిల్లాలో సుమారు 40లక్షల మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి 12 కేజీల బియ్యంతో పాటు రూ.1500లను ప్రకటించింది. కేంద్రం తాజాగా ప్యాకేజీ ప్రకటించడంతో గరీబొళ్లకు ఇది కాస్త ఊరట కల్పించినట్టే అయిందని చెప్పాలి. జిల్లాలో ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుందా? లేక ఇంకా కొనసాగుతుందా? అనే అంశంపైనా చర్చించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ లబ్ధిదారులు 2లక్షల 86వేల మంది ఉన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లక్ష5వేల మంది లబ్ధదారులు ఉన్నారు. వారికి 3 నెలల వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న 9లక్షల 30వేల మంది రేషన్ కార్డు దారులకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున 5కిలోల బియ్యం అదనంగా అందనున్నాయి. వీరితో పాటు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే 15వేల మంది, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే 18వేల మంది, సుమారు 17లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు, 5వేల మంది ఆస్పత్రి సిబ్బంది, 10వేల మంది పారిశుధ్య సిబ్బంది ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ కింద లబ్ధి పొందనున్నారు. 58వేల స్వయం సహాయక సంఘాలకు ఊరట లభించనుంది. ప్రభుత్వం ఎలాంటి పూచికత్తు లేని రుణాలు మంజూరు ఇవ్వడం వీరికి లాభం చేకూరుస్తుంది. మహిళా జన్ ధన్ ఉన్న మహిళల సంఖ్య సుమారు 6లక్షలకు పైగానే ఉండటంతో వారికీ కేంద్రం ఆర్థిక సహాయం అందనుంది. అయితే, ఇవన్నీ అర్హులైన వారికి అందాలనీ, అలా కాకుండా మధ్యలోనే మాయమైపోవద్దని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చేయూత ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Tags: pmgkay, centre package, benefit to poor, middle class people, modi govt

Advertisement

Next Story