అవినీతిపై మహిళా లోకం ఆగ్రహం.. పూజా గ్రామైక్య సంఘం కార్యాలయం ముట్టడి

by Shyam |
అవినీతిపై మహిళా లోకం ఆగ్రహం.. పూజా గ్రామైక్య సంఘం కార్యాలయం ముట్టడి
X

దిశ, నల్లబెల్లి : మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, మినహాయింపులు ఇచ్చినా కొందరు అవినీతి పరుల వలన అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మండల సమాఖ్య ఏపీఎంతో సీసీ, సీఏలు కుమ్మక్కై మహిళా సంఘం నిధులను స్వాహా చేస్తున్నారని బాధిత మహిళలు మంగళవారం మహిళా సంఘం భవనాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పూజా గ్రామైక్య సంఘానికి చెందిన నిధులను సదరు సంఘం తీర్మానం లేకుండా సీసీ పద్మ, సీఏ మహిపాల్, ఏపీఎం సునిత సహకారంతో కాజేస్తున్నారని ఆరోపించారు. దీంతో మండల కేంద్రంలోని మహిళ సంఘం భవనాన్ని ముట్టడించి నిరసన తెలిపారు.

70 ఏళ్ళు దాటిన వృద్ధులు మహిళా సంఘాల్లో ఉండేందుకు వీల్లేదని, ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితి నిండిన వారు మహిళా సంఘం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలి. ఈ క్రమంలోనే మహిళా సంఘంలో నిల్వ ఉన్న నిధుల్లోంచి కొంత మొత్తం వైదొలగిన వృద్ధులకు చెల్లించాలి. ప్రస్తుతం రూ.31లక్షల 90వేల నిధులు పూజా గ్రామైక్య సంఘం వద్ద ఉన్నాయి. అయితే, సంఘం నుంచి వృద్ధులు స్వచ్ఛందగా తప్పుకోవాలని, డబ్బులు చెల్లించడం కుదరదని సదరు సీసీ, సీఏలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతులకు రవాణా చార్జీలు చెల్లించింది.

ఆ నిధులను కూడా రైతులకు ఇవ్వకుండా స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు శానిటైజర్ కొనుగోలు తీర్మానం లేకుండా డబ్బులు వాడుకుంటున్నారని, ఇలా ఇష్టానుసారం వ్యవహరించడం ఏంటని మహిళా సభ్యులు మండిపడుతున్నారు. స్త్రీ నిధికి చెందిన డబ్బులను మహిళా సభ్యులకు ఇప్పించాలి. కానీ, స్త్రీ నిధి డబ్బులు ఇప్పించాలంటే అందులో సగం వాటా ఇవ్వాలని సీఏలు అడుగుతున్నారని, ఇవ్వకపోతే నిధులు మంజూరు చేయడం లేదంటూ కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా షేర్ఫ్ ఆడిటర్ వెంకట్ ఘటనా స్థలికి చేరుకొని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు. ఈనెల 12న గ్రామానికి వచ్చి వివరాలు తెలుసుకుని అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story