రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవు: ఎమ్మెల్యే ఆల

by Shyam |
రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవు: ఎమ్మెల్యే ఆల
X

దిశ, దేవరకద్ర: వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్ఠి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు బీజేపీకి గోరీ కట్టడం ఖాయమని హెచ్చరించారు. రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవన్నారు. వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఆల హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రైతుల సమస్యలు తెలియవని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు వారి స్థాయిని, హోదాను మరిచి సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం, పంటల దిగుబడులకు అనుగుణంగా కేంద్రం గోదాములను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ప్రభుత్వం ఏడేండ్లలో ఒక్క ఎఫ్‌సీఐ గోదామునైనా నిర్మించిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వానకాలం ధాన్యంతోపాటు యాసంగి వడ్లను కూడా కొనుగోలుచేయాలన్న డిమాండ్‌తో కోటి సంతకాలు సేకరిస్తామని పేర్కొన్నారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేవరకద్ర నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో చావు డప్పు మోగించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్ఠి అన్నారు.

Advertisement

Next Story