అన్ని ఉన్న నేతల కోసం ఆరాటం.. జనంకోసం లేదు పోరాటం..!

by Shyam |   ( Updated:2021-04-23 10:57:02.0  )
అన్ని ఉన్న నేతల కోసం ఆరాటం.. జనంకోసం లేదు పోరాటం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో వందల మంది సచ్చిపోతున్నా పట్టించుకోకుండా ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు అధినేతలకు చీమ కుట్టినా ఆగమేఘాల మీద హడావుడి చేస్తున్నారు. కరోనా మొదటిసారి బాధితుల కోసం ఎంతో కొంత పని చేసిన నేతలు ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. కానీ టీఆర్​ఎస్​ బాస్​ కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోష్​ వంటి వారికి పాజిటివ్​ వచ్చిందంటే చాలు పూజలు, నోములతో ప్రార్థనలు చేస్తున్నారు. ఇక సొంత నియోజకవర్గాల్లో ఓట్లేసిన జనానికి ఏమైనా అటు వైపు వెళ్లని వారంతా పార్టీ అధినేతల కోసం ప్రత్యేక పూజలకు దిగడంపై విమర్శలు వెల్లువ్వెత్తుతున్నాయి.

ఇటీవల సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోష్​ లకు కరోనా పాజిటివ్​ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారంతా హోం ఐసోలేషన్​కు పరిమితమయ్యారు. కానీ వారి క్షేమం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కంకణం కట్టుకుని పూజలకు దిగారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పాలమూరులో ప్రత్యేక పూజలు చేశారు. అటు మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, పువ్వాడ అజయ్​తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పూజలు, వ్రతాలతో దేవుళ్లను వేడుకుంటున్నారు. తమ నేతలు బాగుండాలంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రమంతా కరోనా సెకండ్​ వేవ్​తో విలయతాండవం చేస్తుంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడాచూడటం లేదు. అంతేకాదు.. నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రింబవళ్లు తిరిగి, కరోనా అంటుపెట్టుకున్న నేతలు, కార్యకర్తలకు కనీసం ఫోన్​లో కూడా ధైర్యం చెప్పేవారు కరువయ్యారు. కానీ అన్ని సౌకర్యాల్లో ఉన్న అధినేతల కోసం మాత్రం పూజలకు దిగుతున్నారు.

అటు కాంగ్రెస్​ నేతలు కూడా తామేం తక్కువ కాదంటూ నిరూపించుకున్నారు. రాహుల్​గాంధీ క్షేమంగా ఉండాలంటూ హైదరాబాద్​లోని చార్మినార్​ భాగ్యలక్ష్మీ టెంపుల్​లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే స్థానికంగా మాత్రం విమర్శలు తలెత్తుతున్నాయి. ముందుగా కిందిస్థాయిలో ఉండేందుకు ఓ గది కూడా లేకుండా ఉండి కరోనాతో పోరాడుతున్న జనాన్ని పట్టించుకోవాలని, ఆ తర్వాత అన్ని సౌకర్యాలతో హాయిగా ఉన్న నేతల గురించి పూజలు చేసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story