ఎవరి 'గుర్తులు' ఎవరు తీసుకున్నారు?

by Javid Pasha |
ఎవరి గుర్తులు ఎవరు తీసుకున్నారు?
X

న్యూఢిల్లీ: శివసేన పార్టీ, దాని ఎన్నికల గుర్తుకోసం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య జరుగుతున్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున శివసేనను, ఆ పార్టీ గుర్తును షిండే వర్గానికే కేటాయిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ నెల 17న ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన విచారణ త్వరలోనే జరగనుంది. అయితే, దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. ఓ పార్టీ కోసం ఇద్దరు నేతలు కొట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ తరహా ఘటనలు గతంలో చాలానే జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ), సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) వంటి పార్టీల్లోనూ చీలికలు వచ్చాయి. మరి, అలాంటి సందర్భాల్లో ఏం జరిగింది? ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే విషయాలు తెలుసుకుందాం.

ఎల్జేపీ కోసం పాశ్వాన్‌ల మధ్య పోరు: బిహార్‌ నుంచి రాజసభ్య మాజీ ఎంపీ, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం(2020 అక్టోబర్) అనంతరం పార్టీపై ఆధిపత్యం దక్కించుకునేందుకు ఆయన సోదరుడు పశుపతి కుమార్ పరాస్, కొడుకు చిరాగ్ పాశ్వాన్ మధ్య పోరు మొదలైంది. తన తండ్రి మరణం తర్వాత పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. కానీ, పశుపతి తిరుగుబాటు చేసి జూన్ 2021లో నిజమైన ఎల్జేపీకి తానే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇద్దరూ ఈసీని ఆశ్రయించగా, పార్టీ గుర్తు 'బంగ్లా'ను స్తంభింపజేసింది. చిరాగ్‌కు హెలికాప్టర్, పశుపతికి కుట్టుమిషన్ గుర్తు కేటాయించింది. పార్టీ పేర్లు వేర్వేరుగా కేటాయించింది. ఈ పోరు ఇంకా సాగుతోంది.

ఎస్పీ: యూపీలో సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ), ఎన్నికల గుర్తు సైకిల్ కోసం అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ మధ్య 2017లో గొడవ జరిగింది. ఈ వ్యవహారం ఈసీకి చేరగా, అఖిలేశ్ యాదవ్ తన మెజార్టీని నిరూపించుకున్నారు. దీంతో పార్టీని, గుర్తును ఈసీ అఖిలేశ్‌కే కేటాయించింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసిపోయారు.

టీడీపీ: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1995లో తన మామ, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేశారు. కుటుంబ సభ్యుల మద్దతుతో 200 మంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపే నిలిచారు. అయితే, ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మి పార్వతి వేరే పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకే 1996 జనవరి 18న రామారావు కన్నుమూశారు. దీంతో పార్టీ నియంత్రణపై వివాదం ఈసీని చేరడంతో చంద్రబాబుకు అనూకూలంగా ప్రకటన వచ్చింది. ఆయన పార్టీ గుర్తుతోపాటు అధికారాన్నీ దక్కించుకున్నారు.

ఏఐఏడీఎంకే: 'ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం'(ఏఐఏడీఎంకే) పార్టీ వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ 1987 డిసెంబర్‌లో మరణించిన తర్వాత పార్టీ నియంత్రణపై వివాదం చెలరేగింది. సీఎంగా కొనసాగిన జయలలిత, ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్‌‌కు మధ్య వైరం నెలకొంది. జానకీ రామచంద్రన్ స్వల్పకాలిక పోరాటంలో గెలిచారు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరగా, అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏఐడీఎంకే ఓడిపోయి, డీఎంకే గెలిచింది. అయితే, జయలలిత నాయకత్వం వహించిన ఏఐడీఎంకేలోని ఓ చీలిక వర్గానికి 27 సీట్లు రాగా, జానకీ రామచంద్రన్ వర్గానికీ ఒక్క సీటూ రాలేదు. పార్టీ ఓటమితో ఇరు వర్గాలు కలిసిపోగా, పార్టీపై నియంత్రణ జయలలితకే దక్కింది. దశాబ్దాల తర్వాత ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ పన్నీరుసెల్వం(ఓపీఎస్) వర్గాల మధ్య మళ్లీ ఇదే తరహా పోరు మొదలైంది.

కాంగ్రెస్: ఇందిరా గాంధీ 1969లో ప్రధానమంత్రి అయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో సిండికేట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీంతో ఇందిరాను అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. తర్వాత మెజార్టీ పార్టీ సభ్యుల మద్దతుతో ఇందిరాగాంధీ కాంగ్రెస్(ఆర్) అనే కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి కాంగ్రెస్ గుర్తు జోడెడ్లు, నాగలి గుర్తు కోసం ఈసీని ఆశ్రయించగా, తిరస్కరించింది. ఆవు పాలు తాగుతున్న లేగదూడ గుర్తును కేటాయించింది. 1971-77 వరకు ఇదే గుర్తు ఉంది. అయితే, 1977 ఎన్నికల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్(ఆర్)లో మళ్లీ చీలిక రావడంతో కాంగ్రెస్(ఐ) పేరుతో ఇందిరా మరో కొత్త పార్టీ స్థాపించింది. దానికి చేయి గుర్తును కేటాయించింది.

Advertisement

Next Story