తుమ్మిళ్ల ఎత్తిపోతల రిజర్వాయర్ల పూర్తి ఎప్పుడు..?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Kalyani |   ( Updated:2023-05-24 13:01:45.0  )
తుమ్మిళ్ల ఎత్తిపోతల రిజర్వాయర్ల పూర్తి ఎప్పుడు..?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, ఇటిక్యాల: ఆర్డీఎస్ ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుమ్మిళ్ల ఎత్తిపోతల పరిధిలోని కీలకమైన మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను ఎప్పుడు పూర్తి చేస్తారో నడిగడ్డ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎం.జి కృష్ణ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని నడిగడ్డ ప్రజలకు మాయమాటలు చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని విమర్శించారు.

సీఎం కేసీఆర్ స్వయంగా మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి జీఓ జారీ చేసినా ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. నడిగడ్డ రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తుమ్మిళ్ల పరిధిలోని ఆర్డీఎస్‌ కాలువలు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రవీణ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు, బిఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు మహేష్, ఇటిక్యాల మండల పార్టీ అధ్యక్షుడు తిరుపాల్ సుంకన్న, కనకం బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story