Vishnuvardhan Reddy: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. టీ కాంగ్రెస్‌లో లంచ్ పాలిటిక్స్ దుమారం

by samatah |   ( Updated:2022-07-05 07:25:00.0  )
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, వెబ్‌డెస్క్ : Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch| తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు సద్దుమణగడం లేదు. యశ్వంత్ సిన్హా పర్యటనతో మరోసారి బహిర్గతమైన విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శివాలెత్తిన జగ్గారెడ్డి ఆ మరుసటి రోజుకే మెత్తబడటంతో సమస్య సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి లంచ్ పాలిటిక్స్ కు తెరలేపడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నేతలను మంగళవారం విష్ణు లంచ్ కు ఆహ్వానిచడంతో టీ కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నేటి సమావేశంలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ ఏర్పడింది.

సీనియర్ల చాటున 'వారసత్వ పట్టు'

తెలంగాణ కాంగ్రెస్ లో ముడు పంచాయతీలు.. ఆరు గొడవలు అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. నేతల మధ్య సయోధ్య ఎలా ఉన్నా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న విష్ణు వర్ధన్ రెడ్డి అనూహ్యంగా యాక్టివ్ గా మారడం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది. పీజేపీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విష్ణుకు ఇటీవల రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. తనను సంప్రదించకుండానే తన సోదరి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించారని, ఆ సందర్భంలో విజయా రెడ్డిని ఉద్దేశించి పీజేఆర్ వారసురాలు అని రేవంత్ సంబోధించడం, గ్రేటర్ కాంగ్రెస్ కు ఓ దళపతి దొరికిందనే చెప్పడం విష్ణుకు ఆగ్రహం తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. పీజేఆర్ వారసుడిని తానే అవుతానని అలాంటప్పుడు వారసురాలిగా తన సోదరి పేరు ప్రస్తావించడం ఏంటనేది విష్ణు వాదనగా తెలుస్తోంది. తనను కాదని తన సోదరిని ప్రమోట్ చేస్తున్న రేవంత్ రెడ్డి సంగతి ఏంటో ఓ పట్టు పట్టాలనే విష్ణు అనూహ్యంగా సీనియర్లతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఇన్నాళ్లు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న విష్ణు ఇంటికి స్వయంగా వెళ్లిన రేవంత్ రెడ్డి.. తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఔనన్న విష్ణు ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఇటీవల రాహుల్ తెలంగాణ పర్యటన సందర్భంగాలోనూ గాంధీ భవన్ వైపు తొక్కి చూడలేదు. అలాంటి విష్ణు తన సోదరి విజయా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగానే అనూహ్యంగా యాక్టివ్ అయిపోయారు. గత ఆదివారం భట్టి విక్రమార్క, మధుయాష్కితో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయ ప్రస్తావన ఏమీ లేదని అంతా భావించినా నేటి లంచ్ మీటింగ్ తో విష్ణు కొత్త చర్చకు కారణం అయ్యారు.

నేటి సమావేశానికి ఆ సీనియర్ నేత డుమ్మా?

మంగళవారం జరగనున్న లంచ్ మీటింగ్ కు మర్రిశశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శ్రీదర్ బాబు, సీనియర్ నేత వీహెచ్, జానారెడ్డి, కోదండ రెడ్డిలతో పలువురిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే చేరికల పరిశీలన కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జానారెడ్డి ఈ మీటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నా రేవంత్ రెడ్డి తమతో సంప్రదించడం లేదనే అంసతృప్తి ఓ వర్గం నుండి వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చూపిస్తున్నాడని జానారెడ్డి సైతం అసంతృత్తితో ఉన్నాడనే టాక్ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లా నుండి ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే ఆ జిల్లాలో కీలక నేతగా ఉన్న పార్టీ ఫ్లోర్ లీడర్ భట్టీకి రేవంత్ ఆ సమాచారం ఇవ్వలేదట. విజయా రెడ్డి విషయంలోనూ విష్ణు ఇదే ఆగ్రహంతో ఉన్నారట. ఇదిలా ఉండగా ఇటీవల యశ్వంత్ సిన్హాను ఆహ్వానించేందుకు వీహెచ్ ఎయిర్ పోర్టు కు వెళ్లారు. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ హెచ్చరిక చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిని గోడకేసి కొడతానని ఘాటుగా స్పందించారు. ఈ అంశాలన్నిటిపై ఇవాళ్టి మీటింగ్ లో చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

బడంగ్ పేట మేయర్ తో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు సోమవారం కాంగ్రెస్ గూటికి చేరారు. వీరిని రేవంత్ రెడ్డి రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పించారు. చేరికల సమయంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ సభ్యుడు వంశీచందర్ రెడ్డి ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి వంశీచందర్ రెడ్డికి మధ్య గతంలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణు వర్ధన్ ఆగ్రహనికి రేవంత్ చర్యలు మరిత ఊతమిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. టీ కాంగ్రెస్ లో తాజాగా చెలరేగిన తుఫాన్ పై పార్టీ అధిష్టానం ఇప్పటికే రంగంలోకి దిగగా.. స్టేట్ లీడర్లంతా రేవంత్ కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారనే టాక్ పొలిటికల్ కారిడార్ లో రచ్చ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed