టార్గెట్​ తెలంగాణ.. రంగంలోకి దిగిన మోడీ

by Nagaya |   ( Updated:2022-06-01 23:30:44.0  )
టార్గెట్​ తెలంగాణ.. రంగంలోకి దిగిన మోడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో టార్గెట్​తెలంగాణగా పావులు కదుపుతోంది. ఈ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా ప్రణాళిక చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇన్నేండ్లలో ఎన్నడూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించిన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి ఢిల్లీలో అధికారికంగా ఘనంగా ఆవిర్భావ ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలంగాణపై జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిగా దృష్టిసారిస్తుందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ఇలాంటి జాతీయ స్థాయి సమావేశాలు ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేదా త్వరలో అధికారంలోకి వస్తామనుకున్న రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. దీని ద్వారా బీజేపీ నాయకత్వం తెలంగాణ గడ్డ త్వరలో తమదేననే స్పష్టమైన ఇండికేషన్​ఇచ్చేందుకే ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్​వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలంతా తరలిరానున్నారు. 300 మంది డెలిగేట్లతో పాటు మొత్తం దాదాపు వెయ్యి మంది వరకు ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ రెండ్రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ రెండ్రోజుల్లో తెలంగాణ రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండ్రోజులు రాజ్​భవన్‌లో బస చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏకంగా ప్రధాని రెండ్రోజులు ఇక్కడే మకాం వేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా సమావేశ నిర్వహణ వేదిక మాత్రం ఖరారు కావాల్సి ఉంది.

రాష్ట్రంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ హైకమాండ్​మొత్తం హైదరాబాద్‌కు తరలిరానుంది. తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు అటు ప్రజలకు, ఇటు శ్రేణులకు ఇవ్వనుంది. తెలంగాణలో బీజేపీ అవసరం ఉందనే విషయాన్ని నొక్కి చెప్పనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందకు ప్రత్యేక కార్యాచరణ, అమలు చేయాల్సిన వ్యూహాలపై క్లారిటీ ఇవ్వనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా వచ్చారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. అఫీషియల్​ప్రోగ్రాం అయినా మోడీ అనుకున్న షెడ్యూల్‌కు 35 నిమిషాల ముందుగానే నగరానికి చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన వల్ల జరగుతున్న నష్టాలను ప్రజలకు, శ్రేణులకు వివరించారు. ప్రధాని సైతం తాను అనుకున్న షెడ్యూల్‌కు ముందే వచ్చి కేసీఆర్​పై చేసిన విమర్శలతో రాజకీయంగా మరింత హీట్​పెంచారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బలంగా నమ్మడం వల్లే ప్రధాని సైతం అఫీషియల్​కార్యక్రమానికి వచ్చి రాజకీయ విమర్శలు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్​నింపారు.

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయింది. క్రమంగా తెలంగాణ సర్కార్​పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే జేపీ నడ్డా, అమిత్​షా, ప్రధాని మోడీ వచ్చి రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ విమర్శలు చేశారు. శ్రేణులు, నాయకులు, కార్యకర్తల్లో ఫుల్​జోష్​నింపారు. ఈ సమావేశాలతో ఈ జోష్​లెవల్స్​వేరే లెవల్​లో ఉంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తమ పార్టీకి ఈ సమావేశాలు ఫుల్​మైలేజీ ఇస్తాయని బలంగా నమ్ముతోంది. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును అడ్డుకునేవారు ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేస్తోంది. హుజురాబాద్​లాంటి గెలుపును రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

రాష్ట్రంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తే బాగుటుందనే చర్చ బీజేపీలో సాగుతోంది. సమావేశం కోసం స్థల పరిశీలనలో రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ఇప్పటికే హెచ్ఐసీసీతో పాటు నోవాటెల్, తాజ్​కృష్ణ హోటళ్లను సందర్శించారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో ఆతిథ్యంలో ఏమాత్రం రాజీ పడొద్దని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, దాదాపు 300 మంది డెలిగేట్స్, జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో వారి బస ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వం దృష్టిసారిస్తోంది. ప్రముఖ హోటల్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బసను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్​సంతోశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి హెచ్​ఐసీసీ, తాజ్​కృష్ణ, నోవాటెల్​వంటి పలు హోటళ్లను పరిశీలించారు. అనంతరం విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

బండి పాదయాత్రకు బ్రేక్

జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగనున్న నేపథ్యంలో బండి సంజయ్​మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్​పడనుంది. రెండు విడుతలు పూర్తి చేసిన బండి ఈనెల 23 నుంచి 20 రోజుల పాటు అంటే జూలై 12వ తేదీ వరకు యాదాద్రి నుంచి వరంగల్ వరకు మూడో విడుత పాదయాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించుకున్నారు. జూలై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలున్న నేపథ్యంలో మూడో విడుత పాదయాత్ర రద్దు చేసుకోనున్నారు. ఈ యాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను 2004 లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఈసారి నిర్వహించే సమావేశాలనికి హైదరాబాద్​రెండోసారి వేదిక కానుంది.

Advertisement

Next Story

Most Viewed