Ambati Rayudu :అంబటి రాయుడుకు టీడీపీ గాలం.. గుంటూరు లోక్‌సభ స్థానం ఆఫర్?

by Javid Pasha |   ( Updated:2023-06-08 10:25:35.0  )
Ambati Rayudu :అంబటి రాయుడుకు టీడీపీ గాలం.. గుంటూరు లోక్‌సభ స్థానం ఆఫర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అంటూ క్రికెట్ పట్ల సామాన్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు క్రికెటర్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదరణ సైతం లభిస్తోంది. ఇలా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సైతం క్రికెట్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే క్రికెట్‌కు అంబటి రాంబాబు గుడ్ బై చెప్పేశాడు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని కూడా ప్రకటించేశాడు. దీంతో ఇక అంబటి రాయుడు పొలిటీషియన్‌గా అవతారం ఎత్తుతారని ప్రచారం జరుగుతుంది. గతంలో ఎంతోమంది క్రికెటర్లు రిటైర్మెంట్ అనంతరం పాలిటిక్స్‌లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. అదే కోవలో అంబటి రాయుడు సైతం రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం మాట్లాడినా ట్విటర్ వేదికగా అంబటి రాయుడు స్పందించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే అంబటి రాంబాబు మాత్రం ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చేరతారనేదానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో టీడీపీ అంబటి రాయుడుకు గాలం వేసే పనిలో పడిందని తెలుస్తోంది. అంబటి రాయుడు తాత టీడీపీ కార్యకర్త. టీడీపీ హయాంలోనే గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. దీంతో అంబటి రాయుడు కూడా తాత బాటలోనే పయనిస్తూ టీడీపీలో చేరాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు

టీం ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్‌తో మెుదలు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. అంతేకాదు అంబటి రాయుడు పాలిటిక్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ఇందుకు అంబటి రాయుడు ట్విటర్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీంతో అంబటి రాయుడు కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. అంబటి రాయుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ పార్టీలో చేరాలంటూ పలువురు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అంబటి రాయుడుకు స్వతహాగా వైఎస్ జగన్‌పట్ల ఆసక్తి చూపుతుంటారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పాలనపై ప్రసంసలు కురిపిస్తున్నారు. అదే టైంలో వైఎస్ జగన్ ట్వీట్స్‌ను కూడా రీట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు జనసేనలో చేరితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్,బీఆర్ఎస్ సైతం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.

ఆ పార్టీకే అంబటి రాయుడు అవసరం

ఇకపోతే అంబటి రాయుడును ఎలా అయిన తమ పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంబటి రాయుడు అవసరం టీడీపీ అంత అత్యవసరం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన అంబటి రాయుడును పార్టీలో చేర్చకుని గుంటూరు లోక్‌సభ బరిలో దించితే ఎలా ఉంటుందనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. గత ఏడాదికాలంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒకానొక సందర్భంలో వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు. దీంతో టీడీపీకి గుంటూరు లోక్‌సభ అభ్యర్థి కరువు అయ్యారు. ఈ టికెట్ ఆశిస్తున్న నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ గల్లా జయదేవ్ అంతటి ఛరిష్మాలేకపోవడం చంద్రబాబులో ఆందోళన కలుగుతుందట. అదే అంబటి రాయుడులాంటి క్రికెటర్ గనుక వస్తే టీడీపీ గెలుపు ఈజీ అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ గాలం

అంబటి రాయుడిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు టీడీపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మీ తాత గతంలో టీడీపీ సర్పంచ్’ గతాన్ని టీడీపీ అంబటి రాయుడికి గుర్తు చేస్తోంది. టీడీపీ అంటే అంబటి కుటుంబానికి అభిమానం ఎక్కువ అని అలాగే అంబటి రాయుడు కుటుంబానికి టీడీపీ సముచిత గౌరవం కల్పించిందని ఆపార్టీ చెప్తోంది. తాత అడుగు జాడల్లో నడుస్తూ టీడీపీలో చేరితే ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అంబటి రాయుడు తాత బాటలో పయనించి టీడీపీలో చేరతారా? లేక ఇష్టమైన వైఎస్ జగన్ వెంట అడుగులు వేస్తాడా? కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక వర్గం ఒత్తిళ్లతో జనసేనలో చేరతారా అనే చర్చ జరుగుతుంది. మరోవైపు క్రికెటర్ అజారుద్దీన్ సైతం అంబటి రాయుడుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరితే ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరి అంబటి రాయుడు ఏ పార్టీలో చేరతారు? సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్సేనా లేక క్రికెట్ కోచ్‌గా అవతారం ఎత్తుతారా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

Read more: Ambati Rayudu :మల్కాజిగిరి బరిలో స్టార్ క్రికెటర్.. |


Advertisement

Next Story