సోమేశ్ కుమార్ ను చీఫ్ అడ్వైజర్ గా తొలగించాలి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Kalyani |
సోమేశ్ కుమార్ ను చీఫ్ అడ్వైజర్ గా తొలగించాలి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, బడంగ్​పేట్​: ఉద్యోగ విరమణ చేసిన సోమేశ్ కుమార్ కు మళ్ళీ సీఎం చీఫ్ అడ్వైజర్ పదవి ఏంటి? ఇక్కడ ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి.? ధరణి సృష్టి కర్త, స్కాం స్టార్ సోమేశ్ కుమార్ ను తక్షణమే చీఫ్ అడ్వైజర్ పదవి నుంచి తొలగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సుల్తాన్​ పూర్​ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మామిడిపల్లి వరకు చేరుకుంది. అనంతరం మామిడిపల్లి చౌరస్తాలో పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంగళవారం సోమేశ్ కుమార్ ను సీఎం చీఫ్ అడ్వైజర్ గా నియామకం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చూసి ఆశ్చర్యం వేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేష్ కుమార్ ప్రైవేట్ వ్యక్తులకు క్లియర్ చేసిన ప్రభుత్వ భూముల పై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తామని వెల్లడించారు. అవసరం అయితే రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు.ఇందిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదన్నారు.

సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూ లకు వెళ్లి వచ్చే దమ్ము ఉందా? అని మంత్రి కేటీఆర్, తలసానికి భట్టి సవాల్ విసిరారు. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకని మిగులు భూములు ఉన్నచోట కట్టాలని సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు పంపిణీ చేసిన భూముల వివరాలు, ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూముల వివరాల విలువను స్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వై.అమరేందర్​రెడ్డి, దేపా భాస్కర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed