కమలంలో కల్లోలం.. కీలక నేతలు పార్టీని వీడుతారా..?

by Nagaya |   ( Updated:2022-10-20 03:50:30.0  )
కమలంలో కల్లోలం.. కీలక నేతలు పార్టీని వీడుతారా..?
X

దిశ, ఏపీ బ్యూరో:ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు టీడీపీ-జనసేన అధినేత‌ల భేటీ ప్రభావం రాష్ట్ర బీజేపీపై బలంగా పడింది.చంద్రబాబు, పవన్ క‌ల్యా‌ణ్‌ల కలయిక‌పై ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నప్పటికీ.. ఇంత వేగంగా ఆ భేటీ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో అకస్మాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు ఇప్పటికే జనసేన‌తో పొత్తులో ఉన్న బీజేపీ‌కి షాక్ ఇచ్చాయి. మనవాడే అనుకున్న పవన్ స్వయంగా వైసీపీపై పోరాటంలో బీజేపీ తనకు కలసి రాలేదని బహిరంగంగా చెప్పడాన్ని కమలం పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే సాకుగా రాష్ట్ర బీజేపీలో విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. జనసేనతో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలం అయ్యారంటూ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అనడంతో ఒక్కసారిగా బీజేపీలోని లుకలుకలు బయట పడ్డాయి.

ఏపీ రాజకీయాలు పవన్ చుట్టూనే..

కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే బీజేపీలో ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయి. తనకు బీజేపీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని, రోడ్ మ్యాప్ అడిగినా పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తర్వాత చంద్రబాబు పవన్‌తో భేటీ అవడం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఇప్పటివరకు బీజేపీలో సోము వీర్రాజు అంటే కినుకుగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా బయటకు వస్తున్నారు.

సంచలనం సృష్టించిన కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యలు

బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ జనసేన-టీడీపీ భేటీపై స్పందిస్తూ.. తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీర్రాజు పవన్ కల్యాణ్‌తో సమన్వయం చేసుకోలేకపోయారని, రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. సమస్య మొత్తం సోము వీర్రాజు దగ్గరే ఉందని, అన్నీ ఒక్కడే చూసుకోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ బీజేపీకి పవన్ దూరం జరిగాడంటే దానికి కారణం వీర్రాజేనని కన్నా స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ‌లో కల్లోలం రేగింది.

రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులు ఉన్నారా?

బీజేపీ రాష్ట్ర ఇన్‌చా‌ర్జి సునీల్ ధియోధర్ రానున్న ఎన్నికలను సోము నాయకత్వంలోనే ఎదుర్కోబోతున్నామని ప్రకటించారు. వాస్తవానికి మరో రెండు నెలల్లోపు పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఈ పదవికి మరోసారి సోముతోపాటు పార్టీ జాతీయనేత సత్యకుమార్ పోటీపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ధియోధర్ ప్రకటన పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు రుచించడం లేదు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వెళ్లాలి అనీ.. సోము వీర్రాజు ఆ దిశగా ఎలాంటి కృషి చేయలేదనేది వారి ఆరోపణ. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ వ్యవహార శైలిపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేయడంతో .. ఇదే అదనుగా రాష్ట్ర బీజేపీలోని అసంతృప్తులందరూ బయటకు రావడం మొదలైంది.

హుటాహుటిన ఢిల్లీకి సోము వీర్రాజు

రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన పరిణామాల నేపథ్యంలో.. తమతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అసహనం విషయమై షాక్ తిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. అక్కడి పెద్దలకు ఏపీ సంగతులు వివరించి.. వీలైనంత త్వరగా ఏపీ పరిణామాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. దీంతో బీజేపీ హై కమాండ్ పవన్‌ను శాంతపరిచే విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది.. ఇప్పుడు కీలకంగా మారింది. మరో వైవు తనపై సొంత పార్టీ నేతల నుంచే వినవస్తున్న విమర్శలను సోము వీర్రాజు ఎలా తిప్పి కొట్టి.. తన నాయకత్వ పటిమను నిరూపించుకుంటారో అన్నది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి : తడబడుతున్న పవన్ అడుగులు! భవిష్యత్తు గురించేనా

Advertisement

Next Story