ఈటల డైలమా.. ఆత్మసాక్షి అంటూనే ప్రమాణానికి డుమ్మా!

by GSrikanth |
ఈటల డైలమా.. ఆత్మసాక్షి అంటూనే ప్రమాణానికి డుమ్మా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలపై ఈటల డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఆత్మ సాక్షి అంటూనే చాలెంజ్ ను స్వీకరించకుండా ప్రమాణానికి రాకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను ప్రకటించినట్లే భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమాణం చేశారు. సవాల్ ​విసిరినట్టే జూబ్లీహిల్స్​లోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి శనివారం సాయంత్రం చార్మినార్​కు వెళ్లారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం చెప్పినట్లే ప్రామిస్​ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో సీఎం కేసీఆర్ ​నుంచి కాంగ్రెస్​కు ఎలాంటి ముడుపులు ముట్టలేదని అమ్మవారి కండువా కప్పుకొని మరీ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ​పార్టీ, కార్యకర్తలు నష్టపోయేటట్లు తప్పుడు ప్రచారంతో మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. అయితే రేవంత్ తాను విసిరిన ఛాలెంజ్​లో భాగంగా టెంపుల్​కు వెళ్లగా, కాంగ్రెస్​పై ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆలయానికి వెళ్లకపోవడం గమనార్హం. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా హోదాలో భారీ సవాల్​ విసిరి.. మాట నిలపెట్టుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో తప్పుడు ప్రచారం చేసిన ఈటలపై క్రిమినల్​ కేసులు పెట్టాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ ​కౌశిక్ ​యాదవ్​ ఓయూ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పర్సనల్ ప్రోగ్రామ్స్‌లో బిజీ..

మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ నుంచి కాంగ్రెస్​ పార్టీ ఏకంగా రూ.25 కోట్లు తీసుకున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ​చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ​పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధారాలతో రుజువు చేయాలని డిమాండ్​ చేశారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగానే తేల్చుకుందాం? అంటూ శుక్రవారం ఛాలెంజ్ ​విసిరారు. ఈ ఎపిసోడ్​ని ఈటల క్షుణ్నంగా గమనిస్తూనే ఉన్నారు. కానీ రేవంత్ విసిరిన సవాల్​ను స్వీకరించకుండా లైట్ ​తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అంశంపై హడావుడి నడుస్తున్నప్పటికీ, ఈటల తనకు ఏమీ తెలియనట్లు పర్సనల్ ప్రోగ్రామ్స్​లో బిజీగా ఉన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లడంతో ఈటల డైలమాలో పడ్డారని ఆయన సన్నిహితులే పేర్కొంటున్నారు. తన ఆరోపణలను రేవంత్ ఇంత సీరియస్​గా తీసుకుంటాడని ఈటల భావించకపోవచ్చునని స్వయంగా బీజేపీ నేతలే ఆఫ్​ ది రికార్డులో చెప్పడం విశేషం.

బట్ట కాల్చి మీద వేయడం..

కాంగ్రెస్ డబ్బులు తీసుకున్నదని ఆ పార్టీని డ్యామేజ్​ చేసేలా ఆరోపణలు చేసినా.. వాటిని ఆధారాలతో నిరూపించలేకపోయాడని ఈటలపై విమర్శలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రమాణం తర్వాత సోషల్ మీడియాతో పాటు సొంత పార్టీకి చెందిన కొందరి నేతలూ ఈటలపై ఘాటుగా స్పందిస్తున్నారు. బట్ట కాల్చి మీదేసిన పనిచేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకున్న సమాచారం ఉంటే వివరాలు, ఆధారాలను ప్రకటించాల్సి ఉండాలి కదా? అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఆధారాలు లేనిపక్షంలో డబ్బులు తీసుకున్నది కన్ఫామ్ ​అయితే రేవంత్ చెప్పినట్లు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసి ఉండాల్సిందని బీజేపీ నేతలే చర్చించుకోవడం గమనార్హం. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని సోషల్ ​మీడియాలో ఈటలపై తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పోస్టు కోసమే ఈటల అమిత్​ షా, మోడీ దృష్టిలో పడేందుకు ఇలాంటి చీప్ ​ట్రిక్స్ ​ప్రయోగిస్తున్నట్లు కాంగ్రెస్​తో పాటు బీజేపీ నేతలు అంటున్నారు.

ఫ్రస్టేషన్ పాలిటిక్స్..

బీజేపీ చేరికలు కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈటల రాజేందర్ ఆశించిన స్థాయిలో చేరికలను ప్రోత్సహించలేదనేది పార్టీలో జరుగుతున్న చర్చ. ఇటీవల పొంగులేటిని పార్టీలోకి తేవడంపై తొలుత సంప్రదింపులు జరిపినా.. పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఇదే సమయంలో పొంగులేటి కాంగ్రెస్​లో చేరాలని అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇవన్నీ పరిశీలిస్తున్న ఈటల ఇష్యూను డైవర్షన్ ​చేసేందుకు రాజకీయంగా కాంగ్రెస్ ​పార్టీపై ఆరోపణలు చేసి ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. ఆధారాలతో బయట పెట్టాలని కాంగ్రెస్​ డిమాండ్ చేస్తుండగా, తన వద్ద అవి లేవని, ఆదివారం అన్ని విషయాలు చెబుతానని ఈటల మాట దాటవేశారు. బీజేపీ హై కమాండ్​తనపై ఒత్తిడి చేయడంతోనే ఈటల ఇలాంటి పొలిటికల్​కామెంట్లు చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఫ్రస్టేషన్‌తోనే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed