‘రైల్వేశాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదు’

by GSrikanth |
‘రైల్వేశాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో రైల్వే శాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదని, ఎందుకంటే ప్రధాని మోడీనే అన్ని మినిస్ట్రీస్ లు చూస్తారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విమర్శలు చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై శనివారం కేఏ పాల్ స్పందించారు. ఘటన జరగడం చాలా దురదృష్టకరమని, వందలాది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ఘటనకు ప్రధాని మోడీ భాధ్యత వహించి, భాధ్యుడిగా మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భాద్యులైన సంబంధిత అధికారులందరిని విదుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీ అన్ని శాఖలను గ్రిప్ లో పెట్టుకున్నారు కాబట్టి.. ఘటనకు కూడా ఆయనే బాధ్యుడన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన చిన్న ఘటనలకే రాజీనామా చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే 40 ఏళ్లలో ఇంత ఘోర ప్రమాదం ఎక్కడా జరగలేదన్నారు. దేశంలో ప్రాణానికి విలువ లేకుండా పోయిందని, ఎవరైనా చనిపోతే రెండో, మూడో లక్షలు ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ ఘటన పై తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు స్పందించాలని, ఎందుకంటే చనిపోయిన వారిలో తెలుగు వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రమాద మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి కేఏపాల్ తెలియజేశారు.

Advertisement

Next Story