Modi's cabinet: మోడీ కేబినెట్ లో ఆ మంత్రి రూటే సపరేట్.. అయినా ప్రజల మద్దతు ఆయనకే!

by Prasad Jukanti |
Modis cabinet: మోడీ కేబినెట్ లో ఆ మంత్రి రూటే సపరేట్.. అయినా ప్రజల మద్దతు ఆయనకే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మరోసారి సంచలనంగా మారారు. మిగత కేంద్ర మంత్రులకు భిన్నంగా యూట్యూబ్ లో హవా కొనసాగిస్తున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే నితిన్ గడ్కరీ తాజాగా యూట్యూబ్ లో తన అధికారిక చానల్ కు 'గోల్డెన్ ప్లే బటన్' అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డును బుధవారం యూట్యూబ్ ప్రాంతీయ డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ గడ్కరీకి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను గడ్కరీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఈ గుర్తింపు ప్రజల విశ్వాసం, మద్దతుకు ప్రతీక అని అన్నారు. ఈ సన్మానం ద్వారా ప్రజల ప్రశంసలను గుర్తించినందుకు యూట్యూబ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. గడ్కరీ యూట్యూబ్ చానల్ (Gadkari YouTube Channel) ప్రస్తుతం ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లతో 4,200 వీడియోలు పోస్టు చేయబడ్డాయి. ఈ వీడియోలలో అతను హాజరైన అన్ని ప్రారంభోత్సవ వేడుకలు, కొత్త రోడ్‌వేలు, ఎక్స్‌ప్రెస్‌వేల వివరాలు, అలాగే పలు మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు.

కేంద్ర కేబినెట్ లో ఆయన రూటే సపరేట్..:

కేంద్ర కేబినెట్ లో అందరిదీ ఓ లెక్క అయితే నితిన్ గడ్కరిది మరోలెక్క. నిజానికి నితిన్ గడ్కరీ బీజేపీకి (BJP) గతంలో జాతీయ అధ్యక్షుడు. కీలకమైన శాఖలకు మంత్రిగానూ పని చేశారు. ఒకానొక టైమ్ లో పార్టీలో గడ్కరీ స్థానం నెంబర్ త్రీ. కానీ కట్ చేస్తే రెండేళ్ల క్రితం పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంతో పార్టీలో ఆయన మనుగడపైనే సందేహాలు వ్యక్తం అయ్యారు. చివరకు మొన్నటి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఆయనకు టికెట్ అయినా దక్కుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఆయనకు టికెట్ దక్కడం.. ఒక లక్ష 37 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడం.. కేంద్ర కేబినెట్ లో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం చక చక జరిగిపోయాయి. పార్టీలో గడ్కరికీ వాజ్ పెయి (Atal Bihari Vajpayee) తర్వాత అంతటి వివాదారహితుడు అనే పేరున్నప్పటికీ అయన చేసే వ్యాఖ్యలు అంతే స్థాయిలో పొలిటికల్ హీట్ పెంచుతుంటాయి. తనకు ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చిందని, పీఎం పదవి రేస్ లో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు తనకు భరోసా ఇచ్చారని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.

గడ్కరీ నిర్ణయాలకు అందరూ ఫిదా:

పొలిటికల్ గా వెపన్ లాంటి సెటైర్లు వేసే గడ్కారీ తన శాఖలో తీసుకునే నిర్ణయాలు సర్వత్రా ప్రజామోదం పొందుతాయనే టాక్ ఉంది. ఉదాహరణకు ఎండాకాలం తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడే ట్రక్కు డ్రైవర్ల పట్ల గడ్కరీ తీసుకున్న నిర్ణయం హర్షనీయంగా మారింది. 2025 నుంచి అన్ని ట్రక్కు క్యాబిన్ లలో తప్పనిసరిగా ఎయిర్ కండీషన్ ఏర్పాటు చేయాలని గతంలో ట్రక్కు పరిశ్రమలను ఆదేశించారు. ఈ నిర్ణయం లక్షలాది మంది ట్రక్కు డ్రైవర్లకు ఊరట కలిగించనున్నది. ఇక రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అందువల్ల టూవీలర్ వాహన తయారీ దారులు డిస్కౌంట్ కే హెల్మెంట్లు అందించాలని ఇటీవల గడ్కరీ ఆ పరిశ్రమలను అభ్యర్థించారు. ఇక ఆయన తన యూట్యూబ్ చానల్ తో చేప్పే మాటలకు అనేక మంది నెటిజన్లు ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు. అలాంటి కేంద్ర మంత్రి సొంత యూట్యూబ్ చానల్ కు తాజాగా గోల్డెన్ బటన్ రావాడంతో ఆయన పేరు మరోసారి ఇంటర్నెట్ లో వైరల్ గా మారారు. దీంతో పలువురు నెటిజన్లు నితిన్ గడ్కరీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed