ప్రధాని మోడీ రాష్ట్రంపై విషం కక్కారు.. మంత్రి హరీశ్ రావు

by Hamsa |   ( Updated:2023-04-08 11:44:11.0  )
ప్రధాని మోడీ రాష్ట్రంపై విషం కక్కారు.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదని, రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని పరేడ్ గ్రౌండ్ సభలో పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు శుంకస్థాపన చేయడానికి ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినట్లు లేదని.. రాష్ట్రంపై విషం చిమ్మడానికి వచ్చినట్లు ఉందని ఫైర్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్ సభలో పీఎం మోడీ ప్రతి మాట సత్య దూరం అని, ఇన్ని అబద్ధాలు ఆడటం ఆయనకే చెల్లిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు.

నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉందన్న మంత్రి.. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతా లో జమ అవుతున్నాయన్న మంత్రి.. తన వల్లే డీబీటీ మొదలైనట్టు ప్రధాని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతు బంధు స్కీమ్ ను కాపీ కొట్టి పీఎం కిసాన్ గా మార్చి తామే రైతులకు మొదటిసారి ఆర్థికసాయం అందించామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అసలు రైతు బంధు సాయంతో పోలిస్తే పీఎం కిసాన్ సాయమెంత అని మంత్రి హరీశ్ రావు నిలదీశారు.

వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూతనిస్తున్నామన్న ప్రధాని మాటలు పూర్తిగా అవాస్తమని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు కేటాయించిన ITIR ను బెంగళూర్ కు తరలించిందా మోడీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారున్న మంత్రి.. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించిందా మోడీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం ప్రధాని మోడీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story